చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అవకాశంగా తీసుకున్నారు. చంద్రబాబుపై సెటైర్లు వేశారు.


దబిడి దిబిడే..
కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఈమధ్య సినిమాల్లో కంటే రాజకీయాల గురించే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఒకవేళ ఆయన సినిమాలు తెరకెక్కించినా కూడా అవి రాజకీయాల ఆధారితంగానే ఉంటున్నాయి. అందుకే చంద్రబాబు అరెస్ట్‌పై కూడా ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఎన్‌టీఆర్.. ఈ సంఘటనపై స్పందించకపోవడం గురించి కూడా ఒక ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబు అరెస్ట్‌పై అసలు ఎన్‌టీఆర్ స్పందించకపోవడం చూస్తుంటే టీడీపీ భవిష్యత్తు దబిడి దిబిడే అని అర్థమవుతోంది’’ అని వర్మ ట్విటర్‌లో తెలిపారు. ఆర్‌జీవీ ట్వీట్ చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు కూడా ఇదే నిజం అనే భావనలో ఉన్నారు.






రాజకీయాలకు దూరంగా..
ఎన్‌టీఆర్ ఈ మధ్య రాజకీయ విషయాల్లో తలదూర్చడం లేదు. ఎప్పుడూ సినిమాలతోనే బిజీగా ఉండే తను.. అసలు రాజకీయాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోనట్టే ఉంటున్నాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ వరల్డ్ రేంజ్‌లో హిట్ అందుకోవడంతో తన తరువాతి సినిమా కూడా అదే రేంజ్‌లో హిట్ చేయాలి అనే ఒత్తిడి ఎన్‌టీఆర్‌పై చాలా ఉంది. అప్పుడెప్పుడో ఒకసారి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న తర్వాత ఎన్‌టీఆర్.. మళ్లీ అసలు ఎలక్షన్ ప్రచారం జోలికే వెళ్లలేదు. సభాముఖంగా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న విషయానికి కూడా ఎన్‌టీఆర్ కేవలం సోషల్ మీడియా ద్వారానే స్పందించాడు. కానీ ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసి రెండు రోజులు అయినా కూడా ఎన్‌టీఆర్ అసలు ఏ విధంగా స్పందించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.


Also Read : విశాల్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు - 'మార్క్ ఆంటోని' విడుదలకు లైన్ క్లియర్!


చంద్రబాబు చేతికే అధికారం..
తెలుగుదేశం పార్టీ (టీడీపీ).. ఇది సీనియర్ ఎన్‌టీఆర్ స్థాపించిన ఒక ప్రాంతీయ పార్టీ. సీనియర్ ఎన్‌టీఆర్ మరణించిన తర్వాత ఈ పార్టీ బాధ్యతలు పూర్తిగా బాలకృష్ణ, హరికృష్ణకు కాకుండా చంద్రబాబు చేతిలోకి వెళ్లాయి. బాలకృష్ణ, హరికృష్ణకు కూడా పార్టీలో యాక్టివ్ స్థానం ఉన్నా చంద్రబాబు మాత్రమే టీడీపీని శాసించే స్థాయికి ఎదిగారు. దీంతో ఎన్‌టీఆర్ కుటుంబం టీడీపీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మానేసింది. ఆ తర్వాత తరానికి చెందిన జూనియర్ ఎన్‌టీఆర్ అయితే అసలు పార్టీ గురించి, రాజకీయ వ్యవహారాల గురించి ఎప్పుడూ పొరపాటున కూడా మాట్లాడలేదు. తన సినీ కెరీర్ మధ్యలో రాజకీయం అడ్డం రాకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ చంద్రబాబు అరెస్ట్ లాంటి పెద్ద విషయం జరిగినా కూడా ఎన్‌టీఆర్ అస్సలు స్పందించకపోవడంపై ప్రేక్షకుల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial