Dammalapati Srinivas appointed as Advocate General of Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దమ్మాలపాటి శ్రీనివాస్‌ని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కూటమి ప్రభుత్వ హయాంలో 2014- 2019 సమయంలో ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ సేవలు అందించారని తెలిసిందే.
చంద్రబాబు కేసులో వాదనలు వినిపించిన దమ్మాలపాటి
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక అడ్వకేట్ జనరల్ పదవికి దమ్మాలపాటి రాజీనామా చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యలు నిర్వహించడంతో ఆయనపై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం ఆయనపై మీద కక్షగట్టి పలు కేసుల్లో ఆయన పేరు చేర్చింది. ముఖ్యంగా రాజధాని అమరావతి భూముల కేసులో దమ్మాలపాటిని జైలుకు పంపే ప్రయత్నం సైతం జరిగింది. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గత ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయగా, టీడీపీ అధినేత తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
దమ్మాలపాటిపై చంద్రబాబు మరోసారి నమ్మకం ఉంచారు. గతంలో సేవలు అందించిన సీనియర్ అడ్వకేట్, తన కేసులలో వాదనలు వినిపిస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్ కు మరోసారి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతల కేసులు ఆయన డీల్ చేశారు. ఆయనపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాస్ అని తెలిసిందే.