Several airports across India receive bomb threats: న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల కింద ఢిల్లీలో స్కూళ్లలో ఉందని బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అనంతరం ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో బాంబు పెట్టామని సైతం బెదిరింపులు రావడం తెలిసిందే. తాజాగా దేశ వ్యాప్తంగా పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. 


బిహార్ రాజధాని పాట్నా ఎయిర్ పోర్టుతో పాటు వడోదర, జయపుర ఎయిర్ పోర్టుల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వచ్చాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్ పోర్ట్ అధికారులకు, ప్రభుత్వ సంస్థలకు బాంబు బెదిరింపులకు పాల్పడుతూ ఈమెయిల్ చేశారు. బాంబు ఉందని మెయిల్స్ రావడంతో పాట్నా ఎయిర్ పోర్టుతో పాటు జయపుర, వడోదర విమానాశ్రయాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారుల సైతం అప్రమత్తం అయ్యారు.






ఉదయం నుంచి వరుస బాంబు బెదిరింపులు 
మంగళవారం (జూన్ 18న) ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కావాల్సిన దుబాయ్ వెళ్లే విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే ఏమీ లేదని, అది ఆకతాయిల చర్య అని తేలింది. నేటి మధ్యాహ్నం దేశ వ్యాప్తంగా 40 విమానాశ్రయాలకు సైతం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని అధికారులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఉద్దేశపూర్వకంగానే మెయిల్స్ చేశారా, లేకపోతే కుట్ర కోణం దాగి ఉందా అని ఎయిర్ పోర్ట్ అధారిటీ దీనిపై చర్యలకు సిద్ధమైంది.


మరో విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడంతో చెన్నై- దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్ దాదాపు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఉదయం 9.50 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపుల కారణంగా విమానంలో ప్రయాణికులు ఎవర్నీ ఎక్కకుండా చూసి తనిఖీలు చేపట్టారు. కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు సైతం వ్యక్తి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బాంబు డిటెక్షన్ చేసి నిర్వీర్యం చేసే టీమ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి చెందిన స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి సోదాలు చేయగా ఏమీ లేదని తేలింది.