Weather Updates: బంగాళాఖాతంలో 28 ఏళ్ల తరువాత ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతం వైపుగా తీరాన్ని దాటి బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అంతకుముందు తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం నైరుతి తమిళనాడు తీరం నుంచి ఉత్తర తమిళనాడు తీరం వైపుగా కదులుతుందని చెప్పారు. తాజా అల్పపీడనం ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 


ఏపీ, యానాంలలో ఈశాన్య గాలుల ఎఫెక్ట్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరింత తీవ్రమైంది. నేడు తమిళనాడు ఉత్తర తీరం చెన్నై- పుదుచ్చేరికి దగ్గరగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, యానాంలలో ఈశాన్య దిశ నుంచి వేగంగా గాలులు వీస్తాయి. తీరం వెంట ప్రస్తుతం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడమే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. 


మార్చి 6వ తేదీ రాత్రి, మార్చి 7 తేదీల్లో నెల్లూరు జిల్లా దక్షిణ భాగాలు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. చిత్తూరు తూర్పు భాగాల్లో కొన్ని తేలికపాటి వర్షాలు. తమిళనడు బార్డర్ చెన్నైకి దగ్గర ఉన్న ప్రాంతాలు సూళూరుపేట​, తడ​, సత్యవేడు లాంటి  ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది. మిగతా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలలో ఏ మార్పు లేదు. 
కడప దక్షిణ ప్రాంతాల్లో, నెల్లూరు, తిరుపతి నగరంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. 


మార్చి 8న చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలోని దక్షిణ​, పశ్చిమ ఏరియాలు మదనపల్లి, కదిరి, ధర్మవరం లాంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. 
మార్చి 9న అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. తమిళనాడులోని చెన్నై, పుదుచ్చేరి మధ్యలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం, ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను ఆరు బయట ఉంచితే తడిసే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.






తెలంగాణ వెదర్ అప్‌డేట్..
ఏపీలో వర్షాల ప్రభావం తెలంగాణపై సైతం ఉంటుంది. చల్లని గాలులతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు ఉండగా, పగటిపూట గరిష్టంగా ఒకట్రెండు చోట్ల 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. 


Also Read: Gold-Silver Price: కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి నేడు స్థిరంగా - తాజా ధరలు ఇవీ


Also Read: TS Budget 2022: బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం, నేడు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం