TS Budget 2022: తెలంగాణ కేబినెట్ స‌మావేశం ముగిసింది. ప్రగ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న ఆదివారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌ల‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో సోమ‌వారం (మార్చి 7) అసెంబ్లీలో తెలంగాణ‌ బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టనున్నారు. ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు సోమవారం ఉదయం గం.11.30 లకు బ‌డ్జెట్‌ను  ప్రవేశ‌పెట్టనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను మంత్రివర్గం ఆమోదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది. రాబడులు, ఆదాయవ్యయాలు, బడ్జెట్ కేటాయింపులు, ఏడాది కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను సీఎం కేసీఆర్ మంత్రులకు వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 2.31 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ఏడాది బడ్జె్ట్ తో పోలిస్తే 2022-23 రాష్ట్ర బడ్జెట్ కనీసం 10-15 శాతం పెరుగుదల ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దళితుల బంధు కార్యక్రమానికి భారీ కేటాయింపులు చేయడంతో పాటు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వరాలు కురిపిస్తోందని సమాచారం.


గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి


అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేబినెట్ ఆమోదంతో సోమవారం బడ్జెట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 


పూర్తిస్థాయి చివరి బడ్జెట్


బడ్జెట్ సమావేశాలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1200 మంది పోలీసులు అసెంబ్లీ సమావేశాల బందోబస్తులో ఉన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ విధానాలు, వ్యయాలు, లక్ష్యాలు, బడ్జెట్ కేటాయింపులు, తదితర అంశాలను కేబినెట్ లో సీఎం కేసీఆర్ చర్చించారు. 2023 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ అయినందున సీఎం కేసీఆర్ బడ్జెట్ అమలుపై మంత్రులకు వివరించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించినట్లు సమాచారం.  ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులతో పాటు అధికారులందరినీ పూర్తి సమాచారంతో అసెంబ్లీకి రావాలని  మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలను ఉపయోగించుకుని రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను బట్టబయలు చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.