Gannavaram MLA Vallabhaneni Vamsi Mohan : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది. అయితే, ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు వంశీకి నోటీసులు అందించినా రాకపోవటంతో తాజాగా.. వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవటంతో వారెంట్ ను గత విచారణలోనే న్యాయస్థానం జారీ చేసింది. ఇవాళ్టి విచారణకూ వంశీ హాజరుకాకపోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలించింది.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వంశీ తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు ఆయన కుటుంబంపై దారుణమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదంగా మారారు. అయితే ఆయన ఇటీవలి కాలంలో రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. గత రెండు నెలలుగా ఆయన గన్నవరం నియోజవర్గానికి రాలేదని అనుచరులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆయన ప్లాన్లు ఏమిటో తెలియక అనుచరులు కూడా కంగారు పడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేనందున పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ తరపున పోటీ చేయగా.. వైసీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. చాలా స్వల్ప తేడాతో గెలిచిన వంశీ పార్టీ మారిపోవడంతో వెంకట్రావు టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన టీడీపీ తరపున పోటీ చేసేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో వెంకట్రావు నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. మరో వైపు వైసీపీలో వంశీకి పూర్తి స్థాయిలో సహకారం లభించడం లేదు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టి వేధించారని ఎక్కువ మంది వైసీపీ నేతలు ఆయనతో సన్నిహితంగా లేరు. పార్టీ మారినప్పుడు ఆయనతో టీడీపీ నుంచి వెళ్లిన నేతల్లో కూడా కొంత మంది మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు.. ఇలా నియోజకవర్గంలో అనేక రకాలుగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ ఉండటంతో వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
అయన నియోజకవర్గంలో పర్యటించకపోయినా వైసీపీ పెద్దలు .. పట్టించుకోవడం లేదని అంటున్నారు. వంశీ పరిస్థితి బాగోలేదనే గతంలో పార్థసారధిని గన్నవరం నుంచి పోటీ చేయమని అడిగారని అంటున్నారు. అయితే అక్కడ పోటీ చేయడం ఇష్టం లేక పార్థసారధి వైసీపీకి దూరమయ్యారు.