అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ, ఆయన కంపెనీ సహచరులపై అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో.. ఆంధ్రప్రదేశ్‌లో అంతకు మించి దుమారం రేగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి భారీ ముడుపులు ఆంధ్రప్రదేశ్‌లోనే అందినట్లు యు.ఎస్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దాదాపు 1750కోట్ల రూపాయల ముడుపులు ప్రభుత్వ పెద్దలకు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సీఎం జగన్మోహనరెడ్డి ప్రోద్భలంతో అదానీ సంస్థకు లబ్ది చేకూరేలా ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని రద్దు చేసి.. విచారణ జరిపించాలని డిమాండ్లు మొదలయ్యాయి.
మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు అనుచిత లబ్ది చేకూర్చినందుకు గాను మాజీ సీఎం జగన్ మోహనరెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఏపీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తి మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద మాజీ సీఎం జగన్‌తో పాటు, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, గౌతమ్ అదానీపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు.
అవినీతిపై కీలక ఆధారాలున్నాయి.
డిసెంబర్ 1,2021 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా -SECI నుంచి 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కిలోవాట్ 2.42 పైసలకు కొనేవిధంగా దీనిని మరో 7 పైసలు పెంచుకునేవిధంగా 25 ఏళ్లకు ఒప్పందం చేసుకుందని .. కానీ అదే సమయానికి గుజరాత్ లో 1.99పైసలకే యూనిట్ విద్యుత్‌ను కొంటున్నారని చక్రవర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయానికి ప్రజలపై భారం పడుతోందని మాత్రమే తాము అనుకున్నామని కానీ ఇటీవల గౌతం అదానీపై అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో అక్కడ సెక్యూరిటి ఎక్సేంజెస్ కమిషన్ SEC చేసిన ఫిర్యాదుతో ఇందులో భారీ అవినీతి జరిగినట్లు బయటకు వచ్చిందని ఫిర్యాదులో తెలిపారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ఛైర్మన్ గౌతం అదానీ ద్వారా అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికి 1750కోట్లు అందినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. SECI ద్వారా ఏపీకి అదానీ గ్రీన్ ఎనర్జీని అందించేందుకు ఈ డీల్ కుదిరినట్లు అమెరికా అధికారులు చెప్పారని గుర్తు చేశారు.
సీఎంకే ముడుపులు అందాయి
SEC కోర్టుకు సమర్పించిన నివేదికలోని 54 వ పేరాను చక్రవర్తి కంప్లెయింట్ లో పొందుపరిచారు. దాని ప్రకారం “ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోనే చూసుకుంటే.. సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 7000 మెగావాట్లు విద్యుత్ అందించేందుకు సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం ఒక్కో మెగావాట్ కు 25లక్షల చొప్పున అందించేందుకు అంగీకరించామని Azure ( అదానీ యు.ఎస్ పార్టనర్ ) ప్రతినిధులకు అహ్మదాబాద్‌లో జరిగిన వ్యక్తిగత సమావేశం లోచెప్పారు. ఈ లెక్కన 7 వేల మెగావాట్లకు 1750కోట్లు (200మిలియన్$) చెల్లించారు. ఇందులో CMతో సహా ప్రభుత్వ అధికారులకు ముడుపులు అందాయి.” అని ఉంది.
విచారణ చేపట్టాలి
గౌతం అదానీపై యు.ఎస్ లో నమోదైన కేసును అనుసరించి ఏపీలో ముడుపులు ముట్టినట్లు అర్థం అవుతోందన్నారు. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం.. అర్థరాత్రి హడావిడిగా ఒప్పందంపై తన సంతకాన్ని అడిగారని చెప్పారని ఆయనతో బలవంతంగా సంతకం తీసుకున్నారన్న విషయం కూడా తెలుస్తోందాన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు లబ్ది చేకూరేలా అప్పటి సీఎం వ్యవరించి ప్రజలను మోసగించారని.. అందుకోసం జగన్ పై, అప్పటి మంత్రి బాలినేని, ఇంధన కార్యదర్శి శ్రీకాంత్, గౌతమ్ అదానీలపై కేసులు నమోదు చేసి విచారించాలని ఫిర్యాదులో కోరారు.