CM Jagan did not give any clarification on the contest to Gudivada Amarnath  :  మంత్రి గుడివాడ అమర్నాత్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. చేయూత పథకం బటన్ నొక్కేందుకు అనకాపల్లి పర్యటనకు వచ్చిన సీఎం  జగన్.. అమర్నాత్ పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు.  అమర్నాథ్‌ పై కీలక కామెంట్లు చేశారు.. కుడి, ఎడమ అమర్నాథ్, భరత్ వున్నారు ఇద్దరు తమ్ముళ్లు… అమర్నాథ్ కు భవిష్యత్ లో చాలా మంచి జరుగు తుంది.. నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నారు. భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు. అమర్నాథ్‌కు అనకాపల్లి పార్లమెంట్ సీటు అయినా ఇస్తారని అనుకున్నారు. అలా కూడా ఇచ్చే అవకాశం లేదని తాజా పరిణామంతో తేలిపోయిందని విశాఖ వైసీపీ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. 


అమర్నాథ్‌కు సీటు లేదనే సంకేతాలు 


మంత్రి అమర్నాథ్ అనకాపల్లి, చోడవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. అయితే ఈయన ఆశలపై పార్టీ నీళ్లు చల్లింది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ ను ఇన్ చార్జీగా నియమించారు.  గాజువాక కు ఉరుకూటి చందు... చోడవరం కి ధర్మశ్రీలను ఇన్ చార్జీలుగా వైసీపీ నాయకత్వ ప్రకటించింది. ఇన్ చార్జీలే పార్టీ అభ్యర్థులు అంటూ తాజాగా జగన్ ప్రకటించడంతో తాను పోటీ చేయాలనుకున్న మూడు నియోజకవర్గాల్లో మంత్రి అమర్ కు సీటు గల్లంతయిందన్న విషయం స్పష్టమైంది. దీంతో తనకు ఎక్కడో ఓ చోట అవకాశం కల్పించాలని ఆయన హైకమాండ్ వద్ద  లాబీయింగ్ చేసుకుంటున్నారు. 


ఘనమైన రాజకీయ వారసత్వం ఉన్న అమర్నాథ్ 
 
మంత్రి గుడివాడ అమర్నాథ్ తాతలు తండ్రుల నుంచి రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. తన తాత గుడివాడ అప్పన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగగా.. అదే కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి గుడివాడ గురునాథరావు ఎమ్మెల్యే, ఎంపీగా పలుమార్లు గెలుపొందడంతోపాటు మంత్రిగా కూడా పనిచేశారు. అప్పటికే ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న అపర ద్రోణాచార్యుడు ద్రోణం రాజు సత్యనారాయణ కు దీటుగా పార్టీలోనే ఓ వర్గాన్ని తయారు చేశారు. ఉత్తరాంధ్రలో కాపులకు పెద్దదిక్కుగా.. కాపు సామాజిక వర్గ ప్రజలను ఒక తాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి గుడివాడ నాగమణి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ పెద్దగా రాణించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు సీటు ఇవ్వకపోవడంతో తెలుగుదేశంలో చేరి సీటు దక్కించుకున్నారు. విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన గుడివాడ అమర్నాథ్ తొలుత టీడీపీలో చేరినప్పటికీ అనంతర కాలంలో వైసీపీలో చేరి 2014 లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. తన గురువైన అవంతి శ్రీనివాస్ చేతులో ఓడిపోయారు. అయితే 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ వేవ్ లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయిపోయారు. 


పార్టీ పదవులకే అమర్నాథ్ పరిమితం ? 


మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ ఐదేళ్లలో పలు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో ఆయనకు ఆయనే సాటి.. ఈ రెండు అంశాలే తన సీటుకు ఎసరు పెట్టాయని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో అమర్ విరుచుకుపడడంతో కాపు సామాజిక వర్గంలో పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట.. అలాగే అనకాపల్లిలో గవర సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేకత ఉందట.. ఈ అంశాలన్నీ అధిష్టానానికి చేరడంతో మంత్రి అమర్నాథ్ కు ఎక్కడ సీటు కేటాయించకుండా ఉత్తరాంధ్ర పార్టీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ గా పదవి ఇచ్చింది. వై వీ సుబ్బారెడ్డి కోఆర్డినేటర్ కాగా..అమర్ డిప్యూటీగా మెలగనున్నారు. అందుకే ఇటీవల పలు సందర్భాల్లో అమర్ ఎన్నికల్లో పోటీపై నిరాశ పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు."రాజకీయాల్లో అవన్నీ మామూలే.. నా రాజకీయ భవిష్యత్తు జగన్ చూసుకుంటారు.. పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాను.. జగన్ గెలుపు రాష్ట్రానికి చారిత్రక అవసరం.. నేను స్టార్ క్యాంపెనర్ గా మారి ఉత్తరాంధ్రలో అభ్యర్థులను గెలిపించుకోవడమే పనిగా నిబద్ధతతో పని చేస్తానని చెబుతున్నారు.