Isha Mahashivratri Celebrations 2024: దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఒక ఎత్తైతే...తమిళనాడులో ఈశా యోగా సెంటర్‌లో జరిగే వేడుకలు మరో ఎత్తు. ఎంతో నియమ నిష్ఠలతో ఇక్కడ శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తారు. పలువురు ప్రముఖులూ ఈ ఉత్సవానికి హాజరవుతారు. ఈ ఏడాది కూడా ఇంతే ఘనంగా జరిపేందుకు అంతా సిద్ధమైంది. సద్గురు అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఆదియోగి విగ్రహం వద్ద భారీ వేదిక ఏర్పాటు చేశారు. మహా శివుడి పాటలతో తన్మయత్వంతో మునిగిపోనున్నారు భక్తులు. ప్రత్యేక నృత్యాలూ అలరించనున్నాయి. ఈ వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మార్చి 8వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ఈ లైవ్ 22 భాషల్లో లైవ్‌ టెలికాస్ట్ కానుంది. సద్గురు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌తో పాటు మరి కొన్ని మీడియా ఛానల్స్‌లోనూ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఈ లైవ్‌లోనే సద్గురు బ్రహ్మ ముహూర్తంలో అందరికీ ధ్యానం ఎలా చేయాలో చెబుతారు. శివరాత్రి సమయంలో ధ్యానం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో వివరించనున్నారు. 


"శివరాత్రి రోజున మన శరీరంలో ఓ కొత్త శక్తి పుడుతుంది. అందుకే...ఆ శక్తి మెలకువగా ఉండేలా మనం జాగారం చేస్తాం. ధ్యానం చేస్తూ మనల్ని మనం చురుగ్గా ఉంచుకోవాలి. ప్రకృతితో మమేకమవుతూ ఈ సాధన చేయాలి"


- సద్గురు 






ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. వీళ్లతో పాటు మరి కొంత మంది ప్రముఖులూ హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గాయకుడు శంకర్ మహదేవన్‌తో పాటు గురుదాస్‌ మాన్, పవన్‌దీప్ రజన్, రతిజిత్ భట్టఛర్జీ, మహాలింగం, మూరాలాల్ మార్వాడా...ర్యాపర్స్ బ్రోదా వి, పారాడాక్స్, ఎమ్‌సీ హీమ్‌ సహా మరి కొందరు ఫ్రెంచ్ మ్యుజీషియన్స్ తమ ఆటపాటలో అలరించనున్నారు. ధ్యానలింగం వద్ద పంచభూత ఆరాధన కార్యక్రమంతో ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి. ఆ తరవాత లింగ భైరవి మహా యాత్ర, ధ్యానం, ఆదియోగి దివ్య దర్శనం కార్యక్రమాలు జరుగుతాయి.





ఈ మధ్య కాలంలో ఇక్కడి శివరాత్రి వేడుకలు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాయి. 2022లో మహాశివరాత్రి వేడుకల లైవ్ స్ట్రీమింగ్ వ్యూస్ గ్రామీ అవార్డుల లైవ్‌కి వచ్చిన వ్యూస్ కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. 2023లో 140 మిలియన్స్ వ్యూయర్‌షిప్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి లైవ్‌లో ఇన్ని వ్యూస్ వచ్చింది లేదు. ఈ సారి PVR INOX లో ఈశా మహాశివరాత్రి వేడుకల్ని 12 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ కింది లింక్‌లు క్లిక్ చేయండి. 


 



ఈ వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింది లింక్ క్లిక్ చేయండి. 


https://isha.sadhguru.org/mahashivratri/