Telangana News: తెలంగాణలో పలు పార్లమెంట్ స్థానాలకు (Parliament Elections) అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. అయితే కీలకమైన వరంగల్ (Warangal MP Seat) స్థానాన్ని ఎందుకు పెండింగ్‌లో పెట్టింది. దీంతో టికెట్ ఆశిస్తున్న పలువురి నేతల్లో టెన్షన్ మొదలైంది. వర్ధన్నపేట (Wardhannapet) మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ (Aruri Ramesh)... ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీలో చేరి...ఆ పార్టీ తరపున బరిలోకి దిగాలని లెక్కలు వేసుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేటలో ఓడిపోయిన ఆయన...ఎలాగైన పవర్‌లో ఉండాలనే లక్ష్యంతో ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అగ్ర నేతలను ప్రసన్నం చేసుకునేలా పనిలో నిమగ్నం అయినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ టికెట్ తనకేనని...అనుచరులకు చెబుతూనే పోటీకి సిద్దమవుతున్నారు.
తరచూ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా...నిత్యం పార్టీ శ్రేణులకు టచ్‌లో ఉంటున్నారట. ఇప్పటికే రెండు సార్లు ఎంపీ టికెట్‌ను పసునూరి దయాకర్‌కు ఇచ్చిందని...ఈసారి తనకే కేటాయించాలని అరూరి రమేశ్ పట్టుబడుతునట్లు తెలుస్తోంది. అయితే వరంగల్ ఎంపీ సీటు కోసం కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కావ్యతో పాటు మరి కొందరు నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఆరూరి రమేష్ ఒకింత అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బిజెపి కీలక నేతలకు టచ్‌లోకి వెళ్లారు. పార్లమెంట్ సీటు విషయంలో బీఆర్ఎస్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో...అరూరి రమేష్ చూపు బీజేపీ వైపు మళ్లినట్లు సమాచారం. కాషాయ పార్టీ నుంచి ఆరూరి రమేష్ సీటును కన్ఫాం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఆరూరి రమేశ్ ను బీఆర్ఎస్ వదులుకుంటుందా ?
టిఆర్ఎస్ అధిష్టానం ఆరూరి రమేశ్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. రమేశ్ పార్టీని వీడకుండా ఉండేలా సీనియర్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. బిఆర్ఎస్ నుంచి పార్లమెంట్ వరంగల్ స్థానం నుంచి పోటీ చేయడమా ? లేదంటే గులాబీ పార్టీకి రాజీనామా చేసి...కాషాయ పార్టీ నుంచి బరిలో దిగాలా అని అనుచరుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు.
వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ దే బలం
వరంగల్ పార్లమెంట్ పరిధిలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలున్నాయి. ఒక్క స్టేషన్ ఘన్ పూర్ మినహా...అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రామ మందిర నిర్మాణం, ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో...లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ఛరిష్మా ఎక్కువగా ఉందని...అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీలో వరంగల్ ఎంపీ టికెట్ కోసం పోటీ
మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, చింతా సాంబమూర్తి, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. బిజెపి అధిష్టానం మాత్రం ఈ టికెట్‌ను పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఆరూరి రమేష్ కోసమే టికెట్ పెండింగ్ పెట్టిందా అన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ టికెట్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో...బీజేపీకి టికెట్ ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.