Telangana Medaram Jatara records Rs 13.25 crore income in offerings: మేడారం: గిరిజన కుంభమేళా మేడారం మహా జాతర (Medaram Jatara 2024) హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయింది. ఈ ఏడాది సమ్మక్క సారక్క జాతర (Sammakka Sarakka Jatara)కు వచ్చిన భక్తులు తమ కానుకులను సమర్పించుకున్నారు. వాటిని లెక్కించగా రూ. 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత జాతర కంటే తాజాగా ముగిసిన మేడారం జాతరకు రికార్డు ఆదాయం వచ్చింది. 2022 జాతర ఆదాయం కంటే ఈ సారి 1 కోటి 79 లక్షల 87 వేల 985 రూపాయల ఆదాయం ఎక్కువగా వచ్చింది. హనుమకొండ కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కళ్యాణ మండపంలో 8 రోజుల పాటు మేడారం జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు జరిగింది.
4 రోజులపాటు ఘనంగా మేడారం జాతర
ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మల జాతర జరిగింది. జాతరకు కోటి 40 లక్షల మంది భక్తులు తరలవచ్చి అమ్మలను దర్శించుకున్నారు. జాతరకు రాలేని వారు ఇంటి నుంచే మొక్కులను సమర్పించుకున్నారు. మేడారం జాతరలో భక్తులు కానుకలు సమర్పించుకోవడం కోసం 540 హుండీ లు ఏర్పాటు చేయగా 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయల ఆదాయం సమకూరింది. హన్మకొండ టీటీడీ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 6వ తేదీ వరకు 8 రోజుల పాటు లెక్కింపు జరిగింది. 350 మంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. 150 మంది దేవాదాయశాఖ సిబ్బంది. 200 మంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు లెక్కించారు. నోట్లు, కాయిన్స్, బియ్యంను వేరు చేయడం కోసం ప్రత్యేకంగా రెండు యంత్రాలను ఉపయోగించారు.
ఎనిమిది రోజులు లెక్కింపు
దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల పర్యవేక్షణలో ఎనిమిది రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ కొనసాగింది. నోట్లు, కాయిన్స్ కలుపుకొని13 కోట్ల25 లక్షల 22 వేల 511 రూపాయల ఆదాయం వచ్చింది. ఇవి కాక 779 గ్రాముల 800 మిల్లిల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి, ఆరు దేశాలకు చెందిన 308 కరెన్సీ నోట్లు వచ్చాయి. వచ్చిన ఆదాయం, బంగారం, వెండి ని బ్యాంకులో జమ చేశామని వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ రావు చెప్పారు.
గిరిజన పూజారులకు 33 శాతం వాటా
మేడారం హుండీల ద్వారా వచ్చిన ఆదాయంలో 33 శాతం గిరిజన పూజారులకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని దేవాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ రావు తెలిపారు. 15 రోజుల తరువాత నగదుతో పాటు వెండి, బంగారం లెక్కించి పంచడం జరుగుతుందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ సారి హుండీల్లో ప్రభుత్వం రద్దు చేసిన 5 వందల, 2 వేల నోట్ల తో పాటు ఫేక్ కరెన్సీని సైతం గుర్తించారు. రద్దయిన నోట్లు, గాంధీకి బదులుగా అంబేద్కర్ ఫొటోలతో ఉన్న ఫేక్ కరెన్సీని కొందరు భక్తులు హుండీల్లో కానుకలుగా వేశారు.
Also Read: మేడారం జాతర హుండీ లెక్కింపు - అంబేడ్కర్ ఫోటోతో కరెన్సీ నోట్లు, అవాక్కైన అధికారులు