Laxman Sivaramakrishnan slams Ravichandran Ashwin : టెస్ట్ క్రికెట్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న టీమిండియా(Team India) వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌(Ravi chandran Ashwin)పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుండగా... మాజీ దిగ్గజ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్(Laxman Sivaramakrishnan) మాత్రం అశ్విన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వందో టెస్ట్ ఆడుతున్న సందర్భంగా అభినందనలు తెలియజేయాలని అశ్విన్‌కు తాను చాలాసార్లు ఫోన్‌ చేశానని... కానీ అశ్విన్ కాల్ కట్ చేశాడని లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆరోపించారు. మెసేజ్ చేస్తే కనీసం రిప్లే కూడా ఇవ్వలేదని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌లో మాజీ క్రికెటర్లకు దక్కుతున్న గౌరవం ఇది అని అసహనం వ్యక్తం చేశాడు.


తమిళనాడుకు చెందిన శివరామకృష్ణన్, అశ్విన్‌ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు. ఒకే రాష్ట్రానికి చెందిన దిగ్గజ ప్లేయర్ ఫోన్ చేస్తే అశ్విన్ స్పందించకపోవడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంతో అశ్విన్ రికార్డుల కోసం ఆడుతాడని శివరామకృష్ణన్ విమర్శించాడని, అది మనసులో పెట్టుకొని మాట్లాడటం లేదని మరికొందరు అభిమానులు అంటున్నారు 'నేను వందో టెస్ట్‌ ఆడుతున్న అశ్విన్‌ను అభినందించడానికి చాలాసార్లు కాల్ చేశాడు. అతనికి మెసేజ్ కూడా చేశాను. కానీ రిప్లై రాలేదు. మాజీ క్రికెటర్లను ఇలాగే గౌరవిస్తారా" అని లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.


లంచ్‌ సమయానికి వంద పరుగులు


భారత్‌తో జరుగుతున్న అయిదో టెస్ట్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేస్తోంది. తొలి రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి రెండు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఆరంభంలో బజ్‌ బాల్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్‌.. ఆచితూచి బ్యాటింగ్‌ చేసింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు దూకుడు తగ్గించారు. సిరాజ్‌, బుమ్రా అద్భుతమైన బంతులతో పరుగులను కట్టడి చేస్తున్నారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు తొలి 5 ఓవర్లకు 23 పరుగులు చేశారు. పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా ఆచితూచి పరుగులు రాబడుతున్నారు. 12వ ఓవర్లో సిరాజ్‌ వేసిన బంతి క్రాలే ప్యాడ్స్‌ను తాకగా అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. భారత్ రివ్యూ కోరినా అనుకూల ఫలితం రాలేదు. 15 ఓవర్లలో ఇంగ్లాండ్‌ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న బెన్‌ డకెట్‌ 18వ ఓవర్లో కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గిల్‌ అద్భుతమైన క్యాచ్‌తో డకెట్‌ వెనుదిరిగాడు. 27 పరుగులు చేసిన డకెట్‌  ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా ఒడిసిపట్టాడు. తొలి రోజు ఆటలో లంచ్‌ బ్రేక్‌ ముందు చివరి ఓవర్లో భారత్‌కు రెండో వికెట్‌ దక్కింది. 26వ ఓవర్లో ఒలీ పోప్‌ 11 పరుగులు చేసి కుల్‌దీప్‌ వేసిన బంతికి స్టంప్‌ ఔట్‌గా వెనుతిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా క్రాలే 61 పరుగులతో క్రీజులో  ఉన్నాడు. భారత్‌ తీసిన రెండు వికెట్లు కుల్‌దీప్‌ యాదవ్‌కే దక్కాయి.


హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో  జరుగుతున్న  ఐదో టెస్టులో బరిలోకి దిగిన అశ్విన్‌కి ఇది వందో టెస్టు మ్యాచ్.  దీంతో వందవ టెస్టు ఆడుతున్న 14వ ఇండియన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఈ అవార్డును  అశ్విన్ కి ముందు  భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ , వీవీఎస్ లక్ష్మణ్ , అనిల్ కుంబ్లే , కపిల్ దేవ్ , సునీల్ గవాస్కర్ , దిలీప్ వెంగ్‌సర్కార్ , సౌరవ్ గంగూలీ , విరాట్ కోహ్లీ , ఇషాంత్ శర్మ , హర్భజన్ సింగ్ , పుజారా ఉన్నారు.