CM Chandrbabu Tribute To Ratan Tata Deadbody: ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, టాటా సన్స్ సంస్థ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) పార్థీవ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లోని రతన్ టాటా భౌతిక కాయం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో పాటు, గ్రూప్ ఉన్నతాధికారులు, టాటా కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రతన్ టాటా లాంటి మహోన్నత వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోవడం తీరని లోటని అన్నారు.


ప్రజల సందర్శనార్థం రతన్ టాటా పార్థీవ దేహాన్ని ముంబయిలోని NCPA గ్రౌండ్‌లో ఉంచగా.. అనంతరం ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. గ్రౌండ్ నుంచి వర్లీ వరకూ యాత్ర సాగనుంది. వర్లీ శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో రతన్ టాటా పార్థీవ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కడసారి ఆ మహనీయుణ్ని చూసేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అటు, కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరయ్యారు.










గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా (86) ముంబైలో బుధవారం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మరణంపై ప్రముఖులు సంతాపం తెలిపారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఆయన మరణంపై భావోద్వేగ లేఖ రాశారు.


1937 డిసెంబర్‌ 28న రతన్‌ టాటా.. నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 1991లో టాటా గ్రూపు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రతన్ టాటా సంస్థను ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. 2 దశాబ్దాల అనంతరం 2012లో టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. 1996లో టెలికమ్యూనికేషన్స్ కోసం టాటా టెలీ సర్వీసెస్‌ని స్థాపించగా, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)గా రూపాంతరం చెందింది. 2016 అక్టోబర్ నుంచి 6 నెలల పాటు టాటా గ్రూప్‌నకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను 2000లో అందుకున్నారు. భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ 2008లో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. మహారాష్ట్ర, అస్సాం ప్రభుత్వాల నుంచి పురస్కారాలు అందుకున్నారు.


Also Read: Ratan Tata : సర్వమత సమానుడు రతన్ టాటా - పార్ధీవదేహం వద్ద ఈ దృశ్యమే సాక్ష్యం