Chittoor News : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గాండ్లపల్లి గ్రామం వద్ద వ్యవసాయ బావిలో ఏనుగు పడిపోయింది. ఏనుగును గుర్తించిన గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు జేసీబీ సాయంతో బావి గోడను పగలగొట్టి ఏనుగును రక్షించారు.
అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లాలో గుంపు నుంచి తప్పిపోయిన ఏనుగు గాండ్లపల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. చీకట్లో దారి కనిపించక ఏనుగు బావిలో పడిపోయింది. పైకి వచ్చే దారి లేకపోవడంతో ఏనుగు రాత్రంతా బావిలోనే ఉండిపోయింది. మంగళవారం ఉదయం ఏనుగును గమనించిన గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు బావి వద్దకు చేరుకున్నారు. ఏనుగు రక్షించే ప్రయత్నం చేశారు.
స్థానికంగా ఏనుగు హల్ చల్
చిత్తూరు జిల్లాలోని బంగారు పాళ్యం మండలంలో ఏనుగులు గుంపు సంచరిస్తుంది. కౌండిన్య అభయారణ్యం నుంచి పొలాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు నుంచి ఓ ఏనుగు తప్పిపోయింది. తప్పిపోయిన ఒంటరి ఏనుగు స్థానికంగా హల్‌చల్ చేసింది. బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద, బండ్లదొడ్డి, శ్రీని జ్యూస్ ఫ్యాక్టరీ, జాయతీ రహదారిపై స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అదే ఒంటరి ఏనుగు మంగళవారం ఉదయం గాండ్లపల్లి గ్రామం శివారులోని వ్యవసాయ బావిలో పడిపోయింది. స్థానికంగా భయాందోళన గురిచేస్తున్న ఏనుగు, బావిలో పడ్డ ఏనుగు రెండూ ఒకటేనని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు ఏనుగును బయటకు తీసుకొచ్చేందుకు జేసీబీ సాయంతో తవ్వకం చేపట్టారు. బావి గట్టు ఒక పక్క తవ్వడంతో ఏనుగు సురక్షితంగా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఏనుగు పక్కనున్న పొలాల్లోకి పారిపోయింది.
ఫూటుగా తాగి బజ్జున్న ఏనుగులు
ఒడిశాలోని అడవిలో దాదాపు 24 ఏనుగులు గంటల తరబడి నిద్రించాయి. నీళ్లు అనుకొని నాటుసారా తాగడం వల్లే ఇవి గాఢ నిద్రలోకి పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒడిశా కియోంజర్ జిల్లా పరిధిలోని అడవిలోకి స్థానిక గ్రామస్థులు వెళ్లారు. అక్కడ దొరికే కొన్ని పూలు, పండ్లతో 'మహువా' అనే సంప్రదాయక నాటు సారాను తయారు చేయడానికి అన్నీ సిద్ధం చేశారు. తొలుత వాటిని నానబెట్టి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు మంగళవారం తిరిగి అడవిలోకి వెళ్లారు. అయితే వీటిని నానబెట్టి ఉన్న కుండలు పగిలిపోయి ఉండటాన్ని చూసి షాకయ్యారు. కొంతదూరం వెళ్లి చూస్తే 24 ఏనుగులు గాఢ నిద్రలో ఉన్నాయి. కుండల్లోని నానబెట్టిన నీటిని ఏనుగులు తాగేశాయని గుర్తించిన గ్రామస్థులు.. అటవీ అధికారులకు సమచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో అటవీ అధికారులు అక్కడికి వెళ్లారు. అధికారులు భారీ శబ్ధం చేయడంతో ఏనుగులు లేచి వెళ్లిపోయాయి. ఏనుగుల గుంపు అప్పటికే మత్తెక్కించే పువ్వులతో పులియబెట్టిన నీటిని తాగినందుకే గాఢ నిద్రలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Also Read : Tirupati News : తిరుపతి విద్యార్థులు ఆగ్రాలో, సినిమాల ప్రభావంతో ఇంట్లోంచి పారిపోయారు- డీఐజీ రవి ప్రకాష్