కొంతమంది పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. చలికాలం, వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అవి రోగాలు వ్యాప్తి చేసే సీజన్లు. చలికాలంలో ఎక్కువగా జలుబు, జ్వరం బారిన పడుతుంటారు పిల్లలు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారి పట్ల మరింత శ్రద్ధ అవసరం. అందుకు కారణం కోవిడ్ వ్యాప్తి ఇంకా సమసిపోలేదు. కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తునే ఉంటుంది. కోవిడ్ తో పోరాడుతున్న కాలంతో పాటు సీజనల్ ఇన్ఫెక్షన్ గణనీయంగా పెరుగుతాయి. పిల్లలు వాటి బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధకశక్తి పెంచే ఆహార పదార్థాలు ఇవాలి. తరచూ వాటిని తినడం వల్ల వాళ్ళు ఫ్లూ లేదా ఇతర కాలానుగుణ వైరస్ ల బారిన పడే అవకాశం తగ్గుతుంది.


రోగనిరోధక శక్తి మెరుగుపరచడానికి సూపర్ ఫుడ్స్ అవసరం. వాటిలోని అధిక పోషక విలువలు రోగాలతో పోరాడేందుకు సహకరిస్తాయి. ఒక వేళ పోషకాలు లభించే ఆహారాలు వాళ్ళు తినడానికి ఇష్టం చూపించకపోతే ఆయా పదార్థాలతో రకరకాల వంటలు తయారు చేసి అయిన తినే విధంగా చూడాలి. అప్పుడే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు..


చిలగడదుంప: విటమిన్లు, ఫైబర్ తో పాటు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మంచి రుచి ఇవ్వడమే కాదు పిల్లలకి అవసరమైన రోగనిరోధక శక్తి పొందేందుకు సహాయపడుతుంది. నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. పెద్దలకి కూడా ఇది మంచి ఆహారం. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరుగైన ఫోలితాలు పొందుతారు. మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకి మేలు చేస్తుంది.


బెల్లం: చక్కెరకి ప్రత్యామ్నాయంగా దీన్ని చాలా మంది తీసుకుంటారు. ప్రోటీన్, కొలిన్, బీటైన్, విటమిన్ బి 12, బి 6, ఫోలేట్, కాల్షియం, ఐరన్ తో పాటు అనేక ఖనిజాలు ఇది అందిస్తుంది. పిల్లల ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకో చిన్న బెల్లం ముక్క తినిపిస్తే చాలు.


ఉసిరి: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సీజనల్ వ్యాధులు ఫ్లూ, జలుబు, జీర్ణ సమస్యలు వంటి వాటిని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.


ఖర్జూరాలు: హార్మోన్ల నియంత్రణ, వాపు తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి ఇస్తుంది. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటుంది.


సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష పండ్ల వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడేందుకు విటమిన్ సి దోహదపడుతుంది. కొన్ని సిట్రస్ పండ్లు తింటే జలుబు చేస్తుంది అనుకున్నప్పుడు ఎటువంటి ఆహారం పెట్టాలి అనేదాని గురించి వైద్యులని సంప్రదించవచ్చు.


బీట్ రూట్: ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందేందుకు బీట్ రూట్ సహాయపడుతుంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పని చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలపరుస్తుంది. వ్యాధులని నియంత్రిస్తుంది.


టర్నిప్: ఇదొక కూరగాయ, చూసేందుకు ఉల్లిపాయ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ రోగనిరోధక శక్తి ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్లుగా పని చేస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. పెద్దలు కూడా బరువు తగ్గాలని అనుకున్న వాళ్ళు టర్నిప్ ని డైట్లో భాగం చేసుకోవచ్చు. ఫైబర్ మెండుగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ మంచిగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: శీతాకాలంలో చర్మం పొడి బారిపోతుందా? ఇలా చేస్తే మృదువుగా మారుతుంది