Tirupati News : తిరుపతిలో అదృశ్యమైన ఐదు విద్యార్థుల ఆచూకీపై అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం అలిపిరి పోలీసు స్టేషన్ ను అనంతపురం డీఐజీ రవిప్రకాష్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఐజీ రవిప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. అలిపిరి పీఎస్ పరిధిలో భక్తుల ముసుగులో గుర్తు తెలియని వ్యక్తులు అధికంగా ఉంటారని, భోజనం, వసతి సౌకర్యాలు ఉండటంతో నిందితులు భక్తుల ముసుగులో ఉంటారని చెప్పారు. గతంతో పోల్చితే అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు తగ్గారని చెప్పారు. ఈ స్టేషన్ పరిధిలో భూతగాదాలు అధికంగా ఉన్నాయని, లోన్ యాప్ ల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు పెంచుతున్నామన్నారు.
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో
తిరుపతి నగరంలో నేరాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డీఐజీ రవిప్రకాశ్ తెలిపారు. డయల్ 100కి కాల్ వచ్చిన 5 నిమిషాలల్లో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుపతి అన్నమయ్య స్కూల్ విద్యార్థులను ఆగ్రాలో గుర్తించి తిరుపతికి తీసుకొచ్చామని డీఐజీ తెలియజేశారు. ఐదు మంది విద్యార్థుల్లో రెండు జంటలు ప్రేమించుకున్నట్లు విచారణలో తేలిందన్నారు.సోషల్ మీడియా ప్రభావంతో వాళ్లు ఇంటి నుంచి దూరంగా వెళ్లి బతకాలనుకున్నారని, ఆగ్రాలో తెలిసిన వ్యక్తి సహాయంతో పని చేసుకుని బతకాలనుకున్నట్లు ఆయన తెలిపారు. వారితో పాటు ఇంకో అమ్మాయిని కూడా తీసుకెళ్లారని, విద్యార్థులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పిల్లలు సినిమాల ప్రభావంతో ఇంటి నుంచి వెళ్తే అసాంఘిక శక్తులు చేతిలో ఇరుక్కునే అవకాశం ఉందని, ఆడ పిల్లలను వ్యభిచార గృహాలకు అమ్మేస్తారని, మగ పిల్లలైతే అవయవాలను అమ్మేసే అవకాశాలు ఉన్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ తెలియజేశారు.
ఐదుగురు విద్యార్థులు అదృశ్యం
తిరుపతిలో ఇటీవల అదృశ్యమైన ఐదుగురు విద్యార్థులను పోలీసులు వెతికిపట్టుకున్నారు. స్థానిక నెహ్రూనగర్‌లోని అన్నమయ్య పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థులు ఈనెల తొమ్మిదో తేదీన స్కూల్ నుంచి అదృశ్యమయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. విద్యార్థులు ఆగ్రాలో ఉన్నట్టు పోలీసులు సోమవారం గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో ఆగ్రా పోలీసులు విద్యార్థులను సంరక్షణలోకి తీసుకున్నారు. విమానంలో ఆగ్రాకు బయలుదేరివెళ్లిన తిరుపతి పోలీసులు ఆగ్రాకు చేరుకుని విద్యార్థులను రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. విద్యార్థులను విమానంలో చెన్నైకి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి తీసుకువచ్చారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసులు విద్యార్థులను తిరుపతికి తీసుకొచ్చారు. విద్యార్థులందరూ మైనర్లు కావడంతో నిబంధనల ప్రకారం ఆర్డీవో, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించాల్సి ఉంది. బాలికలకు, బాలురకు వేర్వేరుగా ప్రభుత్వ వసతి గృహాల్లో వసతి ఏర్పాటుచేశామని పోలీసులు తెలిపారు. మంగళవారం విద్యార్థులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.