Super Star Krishna Passed Away: సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా ఏపీ డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్నింగ్ షోలు రద్దు చేస్తున్నట్లు ఏపీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగానే రేపు ఉదయం షోలు రద్దు చేస్తున్నట్లు వివరించారు. 


పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ థియేటర్లలో ఉదయం షోలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా, తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి గ్రామస్థులు నివాళులు అర్పించారు.


ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన సూపర్ స్టార్...


కృష్ణకు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. వయసు రీత్యా ప్రతి మనిషి ఆరోగ్యంలో కొన్ని మార్పులు రావడం సహజమే. కృష్ణకూ ఆ విధమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. అందువల్ల, అభిమానులు ఆందోళన చెందారు. సోమవారం ఉదయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఘట్టమనేని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, మధ్యాహ్నానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పటికీ... ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో కృష్ణ హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా మారింది. వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్స అందించారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో అంతర్జాతీయ సదుపాయాలతో ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించింది. ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ... ప్రయోజనం దక్కలేదు. కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.


శోకసంద్రంలో ఘట్టమనేని కుటుంబం..


కుటుంబానికి పెద్ద దిక్కు మరణించడంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో కృష్ణ కుమారుడు రమేష్ బాబు, సెప్టెంబర్ నెలాఖరున కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణించారు. ఇప్పుడు కృష్ణ కన్ను మూశారు. ఒక్క ఏడాదిలో తమకు ఎంతో ఆప్తులైన ముగ్గురు లోకాన్ని విడిచి వెళ్ళడం... మూడు విషాదాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదని తెలుస్తోంది.


అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ పార్థీవ దేహాన్ని నేడు ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ మరణంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.