దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ నవంబరు 15 నుంచి 20 మధ్య వెలువడే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం తరహాలోనే వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు కూడా రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. జనవరిలో మొదటి సెషన్, ఆ తర్వాత ఏప్రిల్‌లో రెండో విడత పరీక్ష నిర్వహించనున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా ఇతర రాష్ట్రాల 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలించి జేఈఈ మెయిన్ తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
ఈ పరీక్షలకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. 2022 జేఈఈ మెయిన్‌లో అనుసరించిన విధానాలనే 2023 జేఈఈ మెయిన్‌లో కూడా అనుసరించనున్నారు. విద్యార్థులు ఏ సెషన్ పరీక్షకు హాజరు కావాలనుకుంటే ఆ సెషన్‌కు పరీక్ష ఫీజు చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఒకవేళ మొదటి సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా తర్వాతి పరీక్షలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు. అలాగే రెండు సెషన్లకు హాజరు కావాలనుకుంటే ఒకేసారి అన్ని సెషన్ల ఫీజు చెల్లించడం, లేదంటే తర్వాతైనా దరఖాస్తు చేసుకునేలా విద్యార్థులకు వెసులుబాటు కల్పించనున్నారు.
షెడ్యూలు ఇలా..
* జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ - నవంబరు 15 - 20 మధ్య.
* జేఈఈ మెయిన్ 2023 రిజిస్ట్రేషన్ - నవంబరు మూడోవారం నుంచి.
* జేఈఈ మెయిన్ 2023 పరీక్ష - మొదటి సెషన్- జనవరిలో, రెండో సెషన్-ఏప్రిల్‌లో
మేలో నీట్ పరీక్ష..
దేశంలో వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్షను వచ్చే ఏడాది మేలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నీట్ పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. నీట్ నోటిఫికేషన్ మార్చిలో వెలువడనుంది. నోటిఫికేషన్‌పాటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది.
Also Read:
విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇక ఒకేసారి రెండు డిగ్రీలు!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఒకేసారి రెండు డిగ్రీలు చేస్తే విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ప్రాంగణ నియామకాల్లో ప్రాధాన్యంతోపాటు అదనపు క్రెడిట్లు దక్కుతాయని రిజిస్ట్రార్ మంజూర్‌హుస్సేన్ తెలిపారు. సమయం వృథా కాకుండా బీటెక్ పూర్తయ్యేలోపే రెండు డిగ్రీలు చేతికి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీబీఏలో మరిన్ని కోర్సులు తీసుకురావాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
KNRUHS: యూజీ ఆయూష్ కోర్సుల్లో ప్రవేశాలు, నేటి నుంచి దరఖాస్తులు
యూజీ ఆయూష్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయూష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సులల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నవంబరు 12న నోటిఫికేషన్ జారీ చేసింది.50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీకు 40 శాతం, దివ్యాంగుకు 45 శాతం మార్కులు) ఇంటర్ (బైపీసీ) ఉత్తీర్ణులై , నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు నవంబరు 13న ఉదయం 8 గంటల నుండి నవంబరు 20న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..