అసెంబ్లీలో తన భార్య గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడి పెట్టారు. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. అసెంబ్లీలో రెండో రోజు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన సతీమణిపై పాలక పక్ష సభ్యులు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, మంత్రి అప్పలరాజు వంటి వారు అదే పనిగా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అయినా స్పీకర్ వారిని వారించలేదు. టీడీపీ సభ్యులకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలని సూచించారు.
చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానన్నారు. అయినా ప్రజా సమస్యల పై చర్చల కోసం భరించానన్నారు. ఈ రోజు తన భార్యను, కుటుంబసభ్యులను కూడా రోడ్డు మీదకు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు మైక్‌ను కట్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు తాను చెప్పాలనుకున్నది చెప్పారు. మళ్లీ సీఎంగానే సభలోకి వస్తానని సవాల‌్ చేసి.. సభ్యులందరికీ నమస్కారం చేసి వెళ్లిపోయారు.
Also Read : బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో వైఎస్సార్‌సీపీ పాగా.. టీడీపీ కోటకు బీటలు!
తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది. రెండున్నరేళ్లుగా వ్యక్తిగతంగా దూషిస్తూ.. వస్తున్నారని అన్నీ భరిస్తూ వస్తున్నానని ఇప్పుడు తన భార్యను కూడా తీసుకొచ్చి విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత పార్టీ ఆఫీసులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల మాటలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. రెండు నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేకపోయారు.
Also Read: చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్ష బీభత్సం... వరద ముంపులో తిరుపతి... జనజీవనం అస్తవ్యస్థం
తాను గెలిచినప్పుడు పొంగిపోలేదని.. ఓడినప్పుడు కుంగిపోలేదన్నారు. తాను అధికారంలో ఎప్పుడు ఉన్నా ఎవర్నీ కించ పరచలేదన్నారు. కానీ ఇప్పుడు తన భార్యను కూడా ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తున్నారన్నారు. ఆమె ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. అయినప్పటికీ ఆమెను కూడా వదిలి పెట్టకుండా వ్యాఖ్యలు చేశారన్నారు. వారి ఇళ్లలోని మహిళలపై ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ఈ అవమాలన్నింటిపై ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు.
Also Read: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్
మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాతనే తాను అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. ధర్మాన్ని గెలిపించాలా.. అధర్మాన్ని గెలిపించాలా అన్నది ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తానన్నారు.