తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ పని మీద దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయనకు సోమవారం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారయింది. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించి.. రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. అయితే చంద్రబాబు పర్యటన అంతటితో ఆగిపోయే అవకాశం లేదు. ప్రముఖ నేతలను కలుస్తారు. పాత రాజకీయ మిత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతున్న అంశం చంద్రబాబుకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు ఇస్తారా ? అన్నదే.
మోడీ, అమిత్ షాను కలుస్తారని టీడీపీ ప్రచారం !
చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాడులు జరిగిన రోజున ఆయననేరుగా అమిత్ షాకు ఫోన్ చేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు నేరుగా తనే ఆధారాలతో సహా ఫిర్యాదులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే శనివారమే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైందన్న ప్రచారం జరిగింది. దీక్ష ముగియగానే ఆయన ఢిల్లీ వెళ్తారని టీడీపీ వర్గాలు చెప్పాయి. కానీ రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ సోమవరం ఖరారైంది. మోడీ, షా అపాయింట్‌మెంట్లపై స్పష్టత లేదు. కానీ టీడీపీ వర్గాలు మాత్రం కలుస్తారని చెబుతున్నాయి.
Also Read: చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత !
అపాయింట్‌మెంట్లు ఇస్తే రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నట్లేనా ?
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు ఇవ్వడం అనేది రాజకీయ కారణాలపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వెళ్లిపోయిన తర్వాత బీజేపీ, మోడీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి తగ్గట్లుగా బీజేపీ కౌంటర్ ఇచ్చారు. నేరుగా కాకపోయినా పరోక్షంగా అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బీజేపీతో సన్నిహితమయ్యారు. కారమం ఏదైనా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న సమయంలో అప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను తొలగించి.. జగన్ పట్ల సానుభూతితో ఉండే సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ తర్వాత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కేంద్రం నుంచి మద్దతు లభించకపోయినా వ్యతిరేకత రాకపోవడం.,. అలాగే ఆర్థిక అంశాల్లో సహకరించడం వంటివి చేస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. బీజేపీకి ఎలాంటి సహకారం కావాలన్నా కనీస షరతులు కూడా లేకుండా ఇస్తోంది. దీంతో ఇప్పుడు రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకోక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని, హోంమంత్రి చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇస్తే అది ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావాన్ని కల్పించడం సహజమేనని భావిస్తున్నారు.
Also Read: చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... పరిటాల సునీత సంచలన కామెంట్స్
చంద్రబాబు బీజేపీని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారా ?
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో చంద్రబాబు సన్నిహితమయ్యారు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. బెడిసికొట్టడంతో కాస్త దూరమయ్యారు. కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండేలా ఓ కూటమికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఏదీ కలిసి రాలేదు. ఆ తర్వాత ఆయన సైలెంటయిపోయారు. కాంగ్రెస్‌తో మాత్రమే కూటమి కట్టాలనుకునే ఇతర నేతలతోనూ టచ్‌లో లేరు. ఇటీవలి కాలంలో మళ్లీ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవ్వాలని అనుకుంటున్నాయి.. కానీ చంద్రబాబు మాత్రం ఆ పార్టీలతో కలిసేందుకు.. కలిసి కార్యాచణ చేపట్టేందుకు ఏ మాత్రం ఆసక్తిగా లేరు. అదే సమయంలో ఆయన బీజేపీ విషయంలో సాఫ్ట్‌గా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆయన మళ్లీ బీజేపీతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు.
Also Read: వైఎస్ఆర్సీపీ ఉగ్రదాడి చేసింది... పోలీసులు దగ్గరుండి మరీ దాడి చేయించారు... వైసీపీపై చంద్రబాబు ఫైర్
చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత రాజకీయంగా ఏపీలో మరింత వేడి !
చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా మరింత వేడి పెరగడం ఖాయమని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ పార్టీలన్నింటిలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. రాజకీయ వ్యూహాలు ప్రారంభించేశారు. తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడులు కలిసి వచ్చాయి. ఆ ఘటన వేదికగానే కార్యాచరణ వేగంగా ఖరారు చేసుకుంది. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చక్కబెట్టుకొస్తే ఏపీలో కొత్త తరహా పాలిటిక్స్ ప్రారంభమయ్యే చాన్స్ ఉందని భావించవచ్చు.