Amaravathi Capital: అమరావతి నిషయంలో ప్రభుత్వం చురుకుగా ముందుకు కదులుతోంది. అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం … అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్‌డిఎ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేశారు. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ప్రభుత్వ భవనాల కాంప్లెక్సుల్ని నిర్మిస్తారు. ఇప్పటికి సచివాలయం, హైకోర్టు వంటి వాటిని నిర్మించారు. కానీ అవి ట్రాన్సిట్ భవనాలే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా నిర్మించాల్సిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు , రాజ్ భవన్ వంటిని నిర్మాణం చేయాల్సి ఉంది. వాటికి పునాదులు కూడా వేశారు. కానీ ఐదేళ్ల క్రితం ప్రభుత్వం మారడంతో ఆగిపోయాయి.
అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు మొత్తం 1,60,41,863 చదరపు అడుగుల్లో ఉంటాయని సీఆర్‌డీఏ గతంలో ప్రకటించింది. శాఖాధిపతుల కార్యాలయాలు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం, మంత్రుల నివాసం, హైకోర్టు, శాసనసభ, శాసన మండలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసం, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస క్వార్టర్లు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస క్వార్టర్ల నిర్మాణాలకు ఎన్ని చదరపు అడుగులు అవసరమో మాస్టర్ ప్లాన్ లో ప్రకటించారు. సచివాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు ఐకానిక్ డిజైన్ రూపొందించారు.
నిజానికి సచివాలయ భవనాల నిర్మాణం కోసం 2018లోనే పునాదులు వేశారు. రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద సచివాలయ భవనాల నిర్మాణానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్‌ను శరవేగంగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సముదాయాన్ని ఐదు టవర్లుగా నిర్మిస్తున్నారు. అందులో నాలుగు టవర్లు వివిధ శాఖాధిపతులకు కేటాయిస్తారు. సీఎం కార్యాలయం ఉండే ప్రధాన నిర్మాణాన్ని 225 మీటర్ల ఎత్తులో 50 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. మొత్తం 69.8లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్ల నిర్మాణం ఉంటుంది.
225 మీటర్ల ఎత్తుతో ప్రపం చంలోనే అతి ఎత్తయిన సచివాలయంగా ఖ్యాతి దక్కించుకోనుంది. 40 అడుగుల ఎత్తు..6.9 మిలియ న్ చదరపు అడుగు ల విస్తీర్ణం..రెండు దశల లిఫ్ఠ్ విధానం ఇక్కడి ప్రత్యేకత. ఇక, 16 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. రూఫ్ టాప్ హెలిపాడ్ కూడా ఉంటుంది. అయిదు టవర్ల కాంట్రాక్టును ఎస్‌సిసి, షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలు దక్కించుకున్నాయి. అయితే రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తి కాగానే ప్రభుత్వం మారింది. దాంతో పనులు ఆగిపోయాయి. ఇటీవల కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు అమరావతిలో చంద్రబాబును కలిసి చర్చించారు. కొత్తగా కాంట్రాక్టులు తీసుకుని పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అందుకే తాజాగా స్థలాలను నోటిఫై చేసినట్లుగా తెలుస్తోంది.