Rajkot Airport Terminal Collapse: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టర్మినల్ రూఫ్ ఘటనను మరిచిపోకముందే రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లనూ ఇలాంటి ఘటనే జరిగింది. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లోని ఓ టర్మినల్ పైకప్పు కుప్ప కూలిపోయింది. ప్రయాణికుల పికప్, డ్రాప్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజ్‌కోట్ ఘటనలో మాత్రం ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే IMD తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. సౌత్ గుజరాత్‌కి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించింది.
జబల్‌పూర్‌లోనూ ఇదే ప్రమాదం..
అంతకు ముందు జబల్‌పూర్‌లోని దుమ్నా ఎయిర్‌పోర్ట్‌లోనూ (Dumna Airport) ఇదే విధంగా రూఫ్ కూలింది. ఈ ఏడాది మార్చి 10న ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. ఇంతలోనే అది కుప్ప కూలిపోయింది. వరుస ఘటనలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 157 ఎయిర్‌పోర్ట్‌లనూ రివ్యూ చేయాలని ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడి కుటుంబానికి కేంద్రం రూ.20 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వారికి రూ.3 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. అటు ప్రతిపక్షాలు మాత్రం మోదీ సర్కార్‌పై తీవ్రంగా మండి పడుతున్నాయి. హడావుడిగా వాటిని ప్రారంభించారని, నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టం సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే...ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన టర్మినల్ పాతదని, ఈ మధ్య కట్టింది కానే కాదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది.
"ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటన విచారకరం. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఇప్పటికే ఒకరు కోలుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇస్తాం"
- రామ్మోహన్ నాయుడు, పౌరవిమానయాన శాఖ మంత్రి
Also Read: Ladakh: లద్దాఖ్‌లో ఘోర విషాదం, యుద్ధ ట్యాంక్ నది దాటుతుండగా ప్రమాదం - ఐదుగురు సైనికులు గల్లంతు