Central Minister Bandi Sanjay Sensational Comments: ఏపీలో గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని.. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టారని.. ఎర్రచందనం దోపిడీతో సర్కారుకో అప్పులిచ్చే స్థాయికి ఎదిగారని అన్నారు. నయవంచకులు పోయి.. స్వామి వారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని తెలిపారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామి వారి నిధులు పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు.
'ఆ దోపిడీపై నివేదిక'
శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని.. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ అన్నారు. 'ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, తిరుపతి బీజేపీ నాయకులు అనేక పోరాటాలు చేశారు. నాస్తికులకు, అన్య మతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు. ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయింది. అరాచక పాలన పోయి గోవిందుడి పాలన వచ్చింది. ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాయి. స్వామి వారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. ప్రధాని మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.' అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బండి సంజయ్ తిరుమలను సందర్శించడం ఇదే తొలిసారి.