AP Beach Sand : ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌లో జరిగిన ఉల్లంఘనలపై దర్యాప్తు జరిపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఆ బీచ్ శాండ్‌లో ఏముంది ? కేంద్రం ఎందుకంత సీరియస్‌గా తీసుకుందన్నది ఆసక్తి రేపుతోంది.
పార్లమెంట్‌లో కేంద్రం ఏం చెప్పింది ?
బీచ్‌శాండ్ తవ్వకాల్లో భాగంగా వెలికితీసిన మోనజైట్‌ను రహస్యంగా ఎగుమతి చేయడం, అమ్మడం విషయంలో ఉల్లంఘనలు జరిగాయని కేంద్ర అణుశక్తి సంస్థ గుర్తించింది. దీనిపై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ద్వారా దర్యాప్తు చేయించాలని గనుల మంత్రిత్వ శాఖను ఆ సంస్థ కోరింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరాం.. అని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
బీచ్ శాండ్ మైనింగ్ అక్రమంగా జరిగిందా ?
బీచ్ శాండ్ ఖనిజవనరుల తవ్వకం కోసం డీఏఈకి ఏపీ ఖనిజవనరుల అభివృద్ధి సంస్థ నుంచి గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 17 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో భీమునిపట్నం , మచిలీపట్నంలో ఏపీఎండీసీని లీజుదారుగా నియమించింది. పర్యావరణ నష్టం, మైనింగ్ చట్టాల ఉల్లంఘన, రహస్యంగా మోనజైట్ ఎగుమతికి సంబంధించి ఫిర్యాదులు రావడంతో ఏపీఎండీసీకి పంపిన మిగతా 15 ప్రతిపాదనలను పక్కన పెట్టారు.
బీచ్ శాండ్ దేనికి ఉపయోగం ?
బీచ్‌శాండ్‌లో లభించే మోనజైట్ నుంచి థోరియంను వేరు చేసి అణు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. థోరియంను భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలని, ప్రైవేట్ రంగానికి అనుమతిని ఇవ్వకూడదని గతంలోనే కేంద్రం అణు విధానం పేర్కొంది. బీచ్‌శాండ్‌లో ఆరు రకాల మినరల్స్ ఉంటాయి. 1. ఇలిమినైట్ 2. రుటైల్ 3. జిర్కాన్ 4. గార్నెట్ 5. మోనజైట్ 6. సిలిమినైట్. వీటిని సాంకేతికంగా హై మినరల్స్‌గా పరిగణిస్తారు. అణుధార్మిక శక్తిని ప్రేరేపించే మినరల్స్‌తో కూడిన వ్యవహారం కావడంతో కేంద్రం అన్ని విషయాలను పరిసీలిస్తోంది.
విచారణ చేయాల్సి ఉన్న ఏపీ ప్రభుత్వం !
కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు చోట్ల జరుగుతున్న బీచ్ శాండ్ తవ్వకాల విషయంలో అక్రమాలు జరిగాయో లేదో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. అయితే ఎలాంటి అక్రమాలు జరగలేదని.. మిగిలిన పదిహేను చోట్ల కూడా మైనింగ్ కు చాన్సివ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.అయితే అణు విద్యుత్‌కు ఉపయోగించేంత భారీ ఖనిజం ఏపీలో ఉండటంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.