Fact check:
వాట్సాప్‌లో ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్‌లు..
సోషల్ మీడియాలో ఏదైనా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందరికీ సులువుగా సమాచారం చేరే వెసులుబాటుతో ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టమూ ఉంది. కొన్నిసార్లు వదంతులు అలానే వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా వాట్సాప్‌లో ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్‌ను వెంటనే ఫార్వర్డ్ చేసేస్తున్నారు. అది నిజమా కాదా అని కూడా ఆలోచించటం లేదు. ఇలా వేలాది మంది షేర్ చేయటం వల్ల అబద్ధం కూడా నిజమని అందరూ నమ్మే ప్రమాదముంది. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో ఓ వాట్సాప్ మెసేజ్ అంతటా సర్క్యులేట్ అవుతోంది. మన జాతీయ గీతం "జనగణమన"ను యునెస్కో ప్రపంచంలోనే ఉత్తమ గీతంగా ప్రకటించిందంటూ ఓ మెసేజ్ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఫార్వర్డ్ అయింది ఈ మెసేజ్. భారతీయుడిగా చాలా గర్వంగా ఉందంటూ ఈ మెసేజ్‌ను వచ్చింది వచ్చినట్టుగా ఫార్వర్డ్ కొట్టేస్తున్నారు. ఇందులో నిజమెంత..? నిజంగానే యునెస్కో జనగణమనను ఉత్తమ గీతంగా గుర్తించిందా..? నిజమేంటి..?
ఇది ముమ్మాటికి ఫేక్..
ఇప్పుడే కాదు. ఏటా ఆగస్టు వచ్చిందంటే చాలు. ఇదే మెసేజ్ వాట్సాప్‌లో తిరుగుతూ ఉంటుంది. యునెస్కో మన జాతీయ గీతాన్ని ఉత్తమ గీతంగా ప్రకటించిందంటూ అప్పుడు కొందరు హడావుడి చేశారు. అయితే యునెస్కో అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. నిజానికి ఈ మెసేజ్ 2008 నుంచి ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంది. ఇది కాస్తా యునెస్కో దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆ సంస్థ..ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ తేల్చి చెప్పింది. "భారత్‌లో కొన్ని బ్లాగ్స్ ఈ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. కానీ భారత్‌తో పాటు ఏ దేశ జాతీయ గీతాన్ని కూడా మేము ఉత్తమ గీతంగా ప్రకటించలేదు. అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదు" అని స్పష్టం చేసింది. 2016లో టాప్ ఫేక్ న్యూస్‌ల జాబితాలో ఈ వార్త కూడా ఉంది. సో...ఇది ఫేక్ న్యూస్. ఎవరు ఫార్వర్డ్ చేసినా...ఇది ఫేక్ అని గుర్తు చేయండి.
Also Read: Uddhav vs Shinde: శిందే అప్లికేషన్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి, ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశాలు