Digital Payments In AP Liqour Shops : ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్‌కు అనుమతించాలంటూ కేంద్రం లేఖ రాసింది.  మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులను అనుమతించడం లేదని.. వైఎస్ఆర్‌సీపీ  రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్  ఐటీ శాఖ ఆర్థిక సలహాదారు సిమ్మి చౌధురి.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.  కేంద్రం ఏపీకి   రాసిన లేఖలో.. డిజిటల్‌ చెల్లింపులు రెవెన్యూ లీకేజీని అడ్డుకోడానికి తోడ్పడుతాయని స్పష్టం చేసింది. డిజిటల్‌ చెల్లింపులకు.. వేగవంతమైన విధానాలను అవలంభించాలని సీఎస్‌కు సూచించింది.  


మరో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ దూరం జరుగుతున్నారా ? టీడీపీ ఎంపీలతోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నారు ?


ఆంద్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్ని సంపూర్ణంగా మార్చేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు  దుకాణాలను అద్దెకు తీసుకుని ఉద్యోగుల్ని నియమించుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే అవడానికి ప్రభుత్వ దుకాణాలే కానీ ఎక్కడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ లేదు. పూర్తిగా నగదు రూపంలోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. 


సీఎం జగన్ ఇవ్వలేమంటున్నారు - కేంద్రం మాకు సంబంధం లేదంటోంది ! పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బాధ్యత ఎవరిది ?


కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా డిజిటల్ లావాదేవీల్నీ ప్రోత్సహిస్తోంది. ఈ కారణంగా చిన్న చిన్న టీ దుకాణాల వారు కూడా డిజిటల్ వాలెట్ విధానంతో పేమెంట్స్ స్వీకరిస్తున్నారు. కానీ పెద్ద  ఎత్తున వ్యాపారం జరిగే మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ లేకపోవడం చాలా కాలంగా విమర్శలకు కారణం అవుతోంది. అవినీతి కోసమే ఇలా చేస్తున్నారని ఎంత ఆదాయం వస్తుంది..  ఎంతకు మద్యం అమ్ముతున్నారో తెలియకుండా ఇలా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున నగదు  బ్లాక్ మనీ రూపంలోకి వెళ్తోందని పిర్యాదులు కూడా చేశారు. వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ కూడా అదే ఫిర్యాదు చేశారు. 


ఈ అంశంపై హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం త్వరలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను తీసుకొస్తామని పలుమార్లు చెప్పింది కానీ ఇంత వరకూ తీసుకు రాలేదు. ఇప్పుడు నేరుగా కేంద్రమే స్పందించి... మద్యం దుకాణాల్లోనూ  డిజిటల్ పేమెంట్స్  వ్యవస్థ తేవాలని సూచించింది. అయితే ఇది ఆదేశం కాదు. అందుకే ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కీలకం. ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను మద్యం దుకాణాల్లోనూ ఏర్పాటు చేస్తే విమర్శలు చేసే వారికి సమాధానం చెప్పినట్లవుతుంది.