మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రాథమిక చార్జిషీటును దాఖలు చేసింది. దాదాపుగా నాలుగు నెలల నుంచి సాగుతున్న విచారణలో సేకరించిన పత్రాలతో కడిన నాలుగైదు బండిల్స్‌ను చార్జిషీట్‌లోని అంశాలకు ఆధారాలుగా సమర్పించారు. మంగళవారమే చార్జిషీట్ దాఖలు చేసేందుకు పులివెందుల కోర్టుకు వచ్చారు.  అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలవులో ఉండటంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ రోజు ఉదయం మళ్లీ పత్రాలతో వచ్చి చార్జిషీట్ దాఖలు చేశారు. చార్జిషీట్‌లో ఏముందో బయటకు తెలియలేదు. కానీ ఇప్పటి వరకూ ఇద్దర్ని అరెస్ట్ చేశారు. సునీల్ కుమార్, ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రధానంగా వారి పాత్రను ఉద్దేశించే చార్జిషీట్‌ను దాఖలు చేసినట్లుగా భావిస్తున్నారు.


Also Read : వైఎస్ వివేకాను హత్య చేసింది వాళ్లిద్దరే ! సీబీఐ రిపోర్టులో కీలక అంశాలు ఇవే !


సీబీఐ చార్జిషీటు దాఖలు చేయడంతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చార్జిషీట్ కాపీని తనకు ఇప్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత రెండు బృందాలుగా వచ్చి విచారణ జరిపారు...కానీ ఎలాంటి పురోగతి లేదు. కరోనా కారణంగా వచ్చిన బృందాలు కూడా మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయాయి. అయితే గత జూన్ మొదటి వారంలో కొత్త సీబీఐ టీం వచ్చింది. అప్పట్నుంచి వారు కడప, పులివెందులలోనే మకాం వేసి రోజువారీ విచారణ జరుపుతున్నారు. 


Also Read : చాలా అవమానంగా ఉంది... వివేకా హత్య కేసును త్వరగా పరిష్కరించండి... సీబీఐని కోరిన సీఎం మేనమామ


సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ సారి దర్యాప్తు పర్యవేక్షణాధిరిని సీబీఐ అధికారులు మార్చారు. డీఐజీ ర్యాంక్‌లో ఉన్న సుధా సింగ్‌ను తప్పించి ఎస్పీ క్యాడర్‌లో ఉన్న రామ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రస్తుతం సీబీఐ విచారణ నడుస్తోంది. మధ్యలో తన ప్రాణానికి ముప్పు ఉందని వివేకా కుమార్తె సునీత కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె ఇంటిని కొంత మంది వివేకా హత్య కేసు అనుమానితులు రెక్కీ చేసినట్లుగా సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. 


Also Read : వివేకా కేసులో సీబీఐ రూ. ఐదు లక్షలిస్తే సీఎం జగన్ రూ. కోటి ఇవ్వాలని రఘురామ సూచన..!


మధ్యలో ఓ సారి సీబీఐ అనూహ్యమైన ప్రకటన చేసింది. వివేకా కేసులో ఖచ్చితమైన సమాచారం ఇస్తే రూ. ఐదు లక్షల బహుమతి ఇస్తామని పత్రికా ప్రకటన ఇచ్చింది. దీంతో సీబీఐ విచారణపై విమర్శలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ సునీల్, ఉమాశంకర్ రెడ్డిలను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు మరో ముగ్గురు వాంగ్మూలాలు నమోదు చేశారు. వాచ్‌మెన్ రంగయ్య, మాజీ డ్రైవర్ దస్తగిరిలతో పాటు కృష్ణమాచారి వాంగ్మూలాలు కూడా నమోదు చేయించారు.  కృష్ణమాచారి ఆయుధాలు అమ్మిన వ్యక్తి. మొత్తానికి కేసు చిక్కుముడి చార్జిషీట్‌ ద్వారా విడిపోతుందో.. లేక కొత్తగా సందేహాలు పుట్టుకొస్తాయో.. చార్జిషీట్ బయటకు వస్తేనే క్లారిటీ వస్తుంది. 


Also Read : వివేకా హత్య కేసులో కీలక మలుపు... గోవాలో సునీల్ అరెస్టు... విచారణలో వేగం పెంచిన సీబీఐ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి