వైఎస్ వివేకా హత్య కేసులో నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామని సీబీఐ ఇచ్చిన ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో రూ. ఐదు లక్షలకు ఆశ పడి వివరాలు చెప్పేందుకు ఎవరూ బయటకు రారని ఎంపీ స్పష్టం చేశారు. వారి ప్రాణాలకు గ్యారంటీ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అందుకే హత్యకేసుకు సంబంధించి నిజాలు తెలిపినవారికి ... సాక్ష్యం చెప్పేందుకు వచ్చేవారికి సీఎం జగన్ రూ.కోటి బహుమానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య గావించబడ్డాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దర్యాప్తు జరిపిన చాలా రోజుల తర్వాత పేపర్ ప్రకటన ఇవ్వడంతో తనకు చాలా మంది ఫోన్లు చేశారని.. ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని ఇలాంటి సమయంలో వివరాలు చెప్పేందుకు వచ్చే వారికి రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సీబీఐ ప్రకటనతో వివేకా హత్యకేసు త్వరగా పూర్తవుతుందని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
వరుసగా విడుదలవుతున్న ఆడియో టేపులను టీడీపీ నేత నారా లోకేష్ మిమిక్రి ఆర్టిస్టులను పెట్టి తయారు చేయిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే చేసిన ఆరోపణలపై కూడా రఘురామ స్పందించారు. ఒక్కొక్కరికి రూ. లక్ష ఇచ్చి వంద మంది మిమిక్రి ఆర్టిస్టులను లోకేష్ పెట్టుకున్నారని ఆర్కే చెబుతున్నారని వంద మంది మిమిక్రి ఆర్టిస్టులు కలిపి చేసింది మూడు ఆడియోలేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచి రూ. పదిహేను కోట్లు తీసుకుని మూడు ఆడియోలే చేసిన కళకారుల్ని పట్టుకుని శిక్షించాలన్నారు. ఆళ్ల తన దగ్గర ఉన్న మిమిక్రి ఆర్టిస్టుల పేర్లను డీజీపీకి ఇవ్వాలన్నారు. లేకపోతే పార్టీకి చెడ్డపేరు వస్తోందని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లపై అప్పులు తీసుకోవాలని చూస్తున్నారని, తప్పుడు పద్ధతిలో కార్పొరేషన్లు పెట్టి అప్పులు చేయడం మంచిది కాదని సూచించారు. ఏపీ మద్యం ఆదాయం ఎక్కడికి పోతోందని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూల్స్‌గా మార్చేసినందున ఇక అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి రఘురామ సూచించారు. ఎక్కువగా నిధులు ప్రైవేటు స్కూల్ విద్యార్థులకే వెళ్తున్నాయన్నారు. ఆ నిధులను మంచి విద్య, వైద్యం కోసం కేటాయించాలన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సీఎం జగన్ విందుకు పిలిచారని మర్యాదపూర్వకంగా పిలిచారు.. మర్యాదపూర్వకంగా వెళ్లారని అందులో వేరే అర్థాలేమీ ఉండవని రఘురామ వ్యాఖ్యానించారు. అలా భేటీ అయినంత మాత్రాన కేంద్రమంత్రివర్గంలోకి వైసీపీని తీసుకుంటారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు.