హుజూరాబాద్ లో ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేతల విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. చివరి రోజు కావడంతో ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. హుజూరాబాద్ లోని మధువని గార్డెన్స్ లో జరిగిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
ఈ రోజు వెల్లడైన సర్వేల ప్రకారం బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని బండి సంజయ్ జోస్యం చెప్పారు. ఈ విషయం తెలిసి సీఎం కేసీఆర్ హైబత్ తిన్నడు అని.. అందుకే.. ఓటుకు రూ.20 వేలు పంచుతున్నడు అని ఆరోపించారు. బీజేపీ ఎక్కడా అడ్డుకోవడం లేదని.. ఆ డబ్బులన్నీ ప్రజలవే.. కనీసం పేదలైనా బాగుపడతరు కదా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ క్యాష్ ను నమ్ముకుంటే.. బీజేపీ క్యారెక్టర్, కెపాసిటీని నమ్ముకుందన్నారు.
'టీఆర్ఎస్ ఫేక్ లెటర్ స్రృష్టిస్తోంది. అడ్రస్ హైదరాబాద్ ది పెట్టి...పిన్ కోడ్ నెంబర్ కరీంనగర్ పెట్టిండ్రు. తప్పుడు ప్రచారంతో ప్రజలను అయోమయం చేయడానికి టీఆర్ఎస్ కుట్ర. వారి గోతిలో వాళ్లే పడతరు.హుజూరాబాద్ ప్రజలారా.. వరి కావాలా? ఉరి కావాలా?.. వరి కావాలంటే బీజేపీకి,.. ఊరి కావాలంటే టీఆర్ఎస్ కు ఓటేయాలి. కేసీఆర్ తాలిబన్ లా మారిండు. వరి వేస్తే సీడ్ దుకాణాలను సీజ్ చేస్తామని కలెక్టర్లు బెదిరిస్తున్నరు. ఎవరిచ్చిండ్రు మీకు అధికారం? బరితెగించి మాట్లాడతారా?సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినా పట్టించుకోడట. ఎఫ్ సీఐ కొనడం లేదని కలెక్టర్ అబద్దాలు చెబుతున్నడు. కేసీఆర్ కాళ్లు మొక్కితే.. ఏదైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నరు. వీళ్లపై చట్ట, న్యాయపరంగా పోరాడతాం.' అని బండి సంజయ్ అన్నారు.
బండి సంజయ్ ఇంకా ఏం మాట్లాడారంటే..
నువ్వెవరు వరి గురించి మాట్లాడటానికి కేసీఆర్.. వరి ధాన్యం మొత్తం కొనేది కేంద్రమే. రైతులను బెదిరిస్తే.. నీ సంగతేందో చూస్తాం....గల్లా పట్టి కొనిస్తాం. ఈ విషయంలో మేం జైలుకు పోయేందుకు సిద్ధం.
కేంద్రం- రాష్ట్రం మధ్య ధాన్యం కొనుగోలు విషయంలో ఒప్పందం కుదిరిన మాట వాస్తవం కాదా? పోయినసారి యాసంగిలో 95 లక్షల మెట్రిక్ టన్నులు, వానాకాంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పంట మొత్తం కొన్నది కేంద్రమే. ఈసారి కూడా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీఎం స్పష్టం చేయాలి.
ఎంఎస్ పీ కేంద్రమే ఇస్తోంది. లేబర్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, కమీషన్ సొసైటీకి ఇస్తోంది. కస్టమ్ మిల్లింగ్ ఛార్జీలు, స్టోరేజీ ఛార్జీలు, అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు, ధాన్యం నిల్వ చేసినందుకు డబ్బులిస్తోంది. గన్నీ బ్యాగులకు డబ్బులిస్తోంది. చివరకు సుతిలి తాడు డబ్బులు కూడా కేంద్రమే ఇస్తోంది. ఇవిగాక కేసీఆర్ కు 2 శాతం కమీషన్ ఇస్తోంది. మరి నువ్వు చేసేదేముంది? ఎందుకు ధాన్యం కొనబోమని బెదిరిస్తున్నవ్. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం నీకు లేఖ రాసిందా?
కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పాలి. ఇంకోసారి సీఎం రైతుల గురించి మాట్లాడాలంటే హుజూరాబాద్ ప్రజలే గుర్తుకురావాలి.
దళిత బంధుపై సీఎం, టీఆర్ఎస్ నాయకులు బరితెగించి అబద్ధాలు చెబుతున్నరు. దళిత బంధును ఆపాలని ఎవరూ లేఖ రాయలేదని సుమోటాగా ఆపేశామని ఎన్నికల సంఘం హైకోర్టులో స్పష్టంగా వాదనలు విన్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దళిత బంధును ఎవరూ ఆపలేదని చెప్పింది. అయినా దళితబంధును ఆపిందెవరో దళిత సమాజమంతా గుర్తించింది.
దళిత బంధు విషయంలో టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుంది. తాను తీసిన గోతిలో తానే పడింది. ప్లీనరీలో క్రికెట్ కామెంటరీ మాదిరిగా సోది చెప్పి కేసీఆర్ వెళ్లిపోయిండు. మధ్యాహ్నం తరువాత ప్లీనరీ నుంచి ఆ పార్టీ నాయకులంతా వెళ్లిపోవడంతో ఖాళీ అయ్యింది.
మీ ఓటుతో గడీలను బద్దలు కొడతాం. కుటుంబ పాలనను, నియంత పాలనను తరిమితరిమి కొడతాం.. మా పోరాటానికి అండగా ఉండాలని కోరుతున్నాం.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి