మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అప్డేట్ వచ్చింది. పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ గోవాలో అరెస్ట్ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించారు. గోవాలో సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన అనంతరం మంగళవారం ఉదయం గోవాలోని స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్ యాదవ్‌ను రిమాండ్‌లోకి తీసుకున్నారు. సునీల్‌ను కడప తీసుకువచ్చి బుధవారం స్థానిక న్యాయస్థానంలో హాజరుపరుస్తారని సమాచారం. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్‌ను సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఈ విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వివేక హత్య కేసు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఆయన్ని తన ఇంటిలోనే 2019 మార్చి 15న గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు కూడా ప్రయత్నించారని అప్పట్లో పోలీసులు తెలిపారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. 2019 మార్చి 15న హత్య జరిగిన రాత్రికి ముందు వివేకా ఎన్నికల ప్రచారానికి కారులో వెళ్లింది ఎర్ర గంగిరెడ్డి. వివేకా ఎక్కడికి వెళ్లినా ఎర్రగంగిరెడ్డి వెంట వెళ్లేవారు. దీంతో హత్యలో గంగిరెడ్డి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. హత్య జరిగిన రోజు ఉదయం ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలు ఎర్రగంగిరెడ్డితోపాటు కృష్ణారెడ్డి, ప్రకాశ్ అనే వ్యక్తులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముందుకు వెనుకకు ఊగిసలాడుతుంది. ఇప్పటికే చాలా సార్లు కడపలో అనుమానితులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ ఏడాది జూన్‌లో మళ్ళీ సీబీఐ విచారణ ప్రారంభించింది. కడపలోనే కాక పులివెందులలో కూడా విచారణ చేపట్టి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ విచారణలో ఇప్పటి వరకూ ఆరుగురు అనుమానితులను విచారించారు. ఈ ఆరుగురు అనుమానితులు వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, వివేకా పీఏ కృష్ణ రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్ మెన్ రంగన్న, ఇనాయతుల్లాతో పాటు ఉమామహేశ్వరరెడ్డి ఉన్నారు.
ఈ అనుమానితులు వివేకా హత్య అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయ్తత్నించారని ఆరోపణలు ఉన్నాయి. వివేకానందరెడ్డితో సన్నిహితంగా ఉన్నవారిని మాత్రమే సీబీఐ పదే పదే విచారిస్తూ ఉండడం గమనార్హం. అనుమానితుల్లో ఎర్ర గంగిరెడ్డి వివేకకు ప్రధాన అనుచరుడు కావడంతో పాటు, చివరి సారిగా వివేకా ఇంటి వద్ద దిగబెట్టి వెళ్లిన వ్యక్తి కావడంతో అతడిని ప్రధానంగా విచారిస్తున్నారు. గంగిరెడ్డి సాక్ష్యాధారాలు చెరిపేశారన్న విషయంలో జైలు శిక్షకూడా పడింది. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి ఇంటి వద్ద రంగన్న కాపలగా ఉన్నారు. గతంలో సిట్ అధికారులు రంగన్నకు నార్కో పరీక్షలు కూడా చేశారు.