CAG Report : ఏపీలో శాసనసభ ఆమోదం లేకుండా ప్రత్యేక బిల్లుల కింద అనధికార లావాదేవీలు జరిగాయని కాగ్ నివేదిక(CAG Report) ఇచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ఆర్థిక లావాదేవీలపై శాసనసభకు కాగ్ నివేదిక సమర్పించింది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.35,540 కోట్ల రెవెన్యూ లోటు(Revenue Deficit) ఉందని కాగ్ తెలిపింది. 2020-21 నాటికి ఏపీకి రూ.3,48,246 కోట్ల రుణాలు ఉన్నట్టు కాగ్‌ పేర్కొంది. దాంతో పాటు రూ.55,167 కోట్ల ద్రవ్య లోటు ఉన్నట్టు వెల్లడించింది. శాసనసభ ఆమోదం లేకుండా ఏపీ ప్రభుత్వం(AP Govt) రూ. 1,10,509 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ తన నివేదికలో తెలిపింది. 


శాసనసభ ఆమోదం లేకుండా నిధుల వినియోగం 


2014-15 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు రూ.2,36,811 కోట్ల నిధులను శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వాలు వినియోగించాయని కాగ్‌ నివేదికలో పేర్కొంది. శాసనసభలో ఆమోదం లేకుండా నిధుల ఖర్చు పెట్టడం ఆర్టికల్ 204, 205 నిబంధనల ఉల్లంఘనేనని కాగ్‌ పేర్కొంది. ప్రత్యేక బిల్లుల కింద రూ. 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని తెలిపింది. 


ఆ రూ.25 వేల కోట్ల రుణం బడ్జెట్ లో చూపించలేదు 


2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్(Off Budget Borrowings) పేరిట రూ.38,312 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినట్టు కాగ్‌ పేర్కొంది. ఈ లావాదేవీలు బడ్జెట్ లో చూపించలేదని తెలిపింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు రూ.1,16,330 కోట్లు చేరాయని కాగ్ వెల్లడించింది. వివిధ సంక్షేమ పథకాల(Welfare Schemes) అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం రూ.25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చినా వివరాలు బడ్జెట్(Budget)లో చూపించలేదని కాగ్‌ నివేదికలో పేర్కొంది. 


బడ్జెట్ లో ఏపీ రెవెన్యూ లోటు 


2022-23 ఆర్థిక సంవత్సరానికి 2,56, 257 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించారు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఇందులో రెవెన్యూ వ్యయం అంచా 2,08, 261 కోట్లగా పేర్కొన్నారు. మూలధన వ్యయం అంచనా 47,996 కోట్ల రూపాయలుగా చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 17,036 కోట్ల రూపాయలు ఉండబోతుందని... ద్రవ్య లోటు 48, 724 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.27శాతంగా, ద్రవ్యలోటు 3.64శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు.