Anantapur Crime : తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్(RRR) మ్యానియా నడుస్తోంది. ఎవరిని కదిలించినా ఇదే టాక్. షో రద్దైందని థియేటర్ అద్దాలు ధ్వంసం చేసి అభిమానులు, టికెట్ల కోసం థియేటర్ యాజమాన్యంతో గొడవపడిన ఫ్యాన్స్ అని పొద్దున్నుంచీ వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి వెళ్లిన ఓ యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. సినిమాకు వెళ్లినందుకు తండ్రి తిట్టాడని ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ ఆ కుటుంబంలో విషాదం నింపిందని బంధువులు అంటున్నారు.
తండ్రి తిట్టాడని యువకుడు ఆత్మహత్య
ఇటీవల కాలంలో ఆత్మహత్య ఘటనలు ఎక్కువయ్యాయి. చిన్న చిన్న కారణాలకే నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో, కావాల్సినవి కొనలేదనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా(Anantapur District) కళ్యాణదుర్గంలో శంకర్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమా విడుదలైంది. అయితే ఆ యువకుడు కాలేజీకి వెళ్లకుండా ఆర్ఆర్ఆర్ సినిమాకు వెళ్లాడు. సినిమా చూసి ఇంటికి వచ్చిన యువకుడిని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన శంకర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఆవేశంలో చేసిన పనికి తల్లిదండ్రులు గుండెకోత మిగిలింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చూస్తూ అభిమాని మృతి
అనంతపురం జిల్లాలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. RRR సినిమా చూస్తూ గుండె పోటుతో ఓబులేసు (30) అనే అభిమాని మృతి చెందాడు. ఎస్‌వీ మాక్స్ థియేటర్‌లో RRR సినిమా చూస్తుండగా ఓబులేసు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఓబులేసును స్నేహితులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తమ అభిమాన హీరో సినిమాలో కనిపించిన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఓబులేసు కుప్పకూలిపోయినట్లు అతడి స్నేహితులు తెలిపారు. అయితే, ఓబులేసుకు గతంలోనే గుండె సమస్య వచ్చిందని, ఆ సమయంలో అతనికి స్టంట్ కూడా వేశారని స్నేహితులు తెలిపారు. అయితే, ఆ సమస్య ఉండగా.. RRR సినిమా చూస్తూ ఎమోషన్‌కు గురై గుండె పోటు వచ్చి ఉంటుందని స్నేహితులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
ఓబులేసు అనంతపురం మున్సిఫాలిటిలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మృతుడు ఓబులేసు చాలా మంచివాడని ఎన్నో సేవా కార్యాక్రమాలు చేశాడని స్నేహితులు రాఘవ తెలిపారు. మృతుడు ఓబులేసు ఎంతో మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడాడని అన్నారు. ‘‘ఓబులేసుకు రెండు సంవత్సరాల క్రితమే గుండేపోటు రావడంతో స్టంట్ వేశారు. సినిమా థియేటర్‌లో సౌండ్ ఎక్కువగా ఉన్నందువల్లే ఈ రోజు మంచి స్నేహితుడు ఓబులేష్ ని కోల్పోయాం’’ అని ఓబులేసు స్నేహితుడు రాఘవ మీడియాతో చెప్పారు.