Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. కోఠి నుంచి జూబ్లీహిల్స్ కు వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. యువతిని జిల్లెలగూడ గాయత్రి నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అఖిల్, నితిన్, ప్రశాంత్, శీనులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవలే ఇలాంటి ఘటన
ఇన్ స్టా గ్రామ్ ద్వారా పరిచయమైన రెండు రోజులకే యువతిపై ఓ యువకుడు, అతని స్నేహితులు గ్యాంగ్ రేప్ చేశారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఓ యువతి ఇన్ స్టా గ్రామ్‌లో రెండు రోజుల క్రితం యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు వాట్సప్‌లో ఛాటింగ్ చేసుకున్నారు. ఇది చివరికి సామూహిక అత్యాచారానికి దారి తీసింది. రాజేంద్ర నగర్ (Rajendra Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సులేమాన్ నగర్‌లో సాజిత్ అనే 27 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఓ ప్రైవేటు ఉద్యోగి. అతడికి రెండు రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్‌లో సంతోష్ నగర్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఇన్ స్టా ఛాటింగ్ ద్వారా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. ఛాటింగ్‌లో న్యూడ్‌గా కనిపించాలని కోరిన సాజీద్ అనే యువకుడు.. ఆ తర్వాత ఆ న్యూడ్ కాల్ మొత్తాన్ని రికార్డ్ చేశాడు. ఆ వీడియోతో యువతిని బ్లాక్ మెయిల్ చేసిన సాజీద్. రాజేంద్రనగర్‌లోని తన స్నేహితుడి గదికి రావాలని బెదిరించాడు.
వీడియోతో బ్లాక్ మెయిల్
వీడియో బయట పడుతుందోనని భయపడిన యువతి సాజీద్ చెప్పిన అడ్రస్‌కు చేరుకుంది. అక్కడి నుంచి యువతిని యువకుడు బైక్‌పై ఎక్కించుకొని సులేమాన్ నగర్‌లోని అతడి స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ యువతిపై అత్యాచారం చేశాడు. అంతేకాక తన నలుగురు స్నేహితులు కూడా యువతిపై అత్యాచారం చేశారు. ఈ క్రమంలోనే సీక్రెట్‌గా యువతి 100 నెంబరుకు ఫోన్ చేసింది. యువతి ఇచ్చిన సమాచారంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. గదిలో ఉన్న యువతిని కాపాడి అత్యాచారానికి పాల్పడ్డ సాజీద్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడటమేగాక హింసించాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.