AP BJP On High Court : కర్నూలులో హైకోర్టు పెడతామని ఇంత కాలం ప్రచారం చేసి.. భావోద్వేగాలు రెచ్చగొట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టుకు చెప్పడం ప్రజల్ని మోసం చేయడమేనని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూల్ లో న్యాయ రాజధాని అనేది సుప్రీంకోర్టులోప్రభుత్వం ఏందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు అమరావతిలోనే కావాలని, సుప్రీం కోర్టులోఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పిన మాటలు అర్థం,పరమార్థం ఏమిటో వైఎస్ఆర్‌సీపీ సీమ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను ఇంకెన్నాళ్ళు మెూసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ సమర్థన
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అనే విధానాన్ని ఏపీ బీజేపీ చాలా కాలంగా పాటిస్తోంది.కర్నూలుకు హైకోర్టు తరలింపును తమ పార్టీ సమర్థిస్తుందని నేరుగానే చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియకు.. మూడు రాజధానుల చట్టానికి సంబంధం లేదని.. ప్రభుత్వం హైకోర్టు ద్వారా..సుప్రీంకోర్టుకు.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు.
సుప్రీంకోర్టులో కర్నూలు హైకోర్టు గురించి ఏం వాదనలు జరిగాయంటే ?
సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై జరిగిన విచారణలో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు కోసం చాలా పెట్టుబడి పెట్టారు...ఇప్పుడు కర్నూలు లో పెట్టాలని ఎందుకు ప్రతిపాదిస్తున్నారన్న సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదుల్ని ప్రశ్నించింది. అదంతా ముగిసిపోయింది… కర్నూలులో పెట్టాలన్న ప్రతిపాదన ఇప్పుడేమీ లేదన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ధర్మాసనానికి స్పష్టం చేశారు. అమరావతిలోనే హైకోర్టు ఉండాలని హైకోర్టు చెప్పిందన్నారు. హైకోర్టు ఎక్కడ ఉండాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని ఈ సందర్భంగా ధర్మాసనం వేణుగోపాల్‌ను ప్రశ్నింది. ప్రభుత్వం కూడా అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నదని.. ఏపీ తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్ స్పష్టంగా చెప్పారు.
రాయలసీమలో చర్చనీయాంశమవుతున్న ప్రభుత్వ వాదనలు
ప్రభుత్వం తరపు లాయర్ కేకే వేణుగోపాల్ వాదనలు ఇప్పుడు రాయలసీమలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించింది. కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుందని చెబుతోంది. అయితే ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు విషయంలో వెనక్కి తగ్గిందా.. మనసు మార్చుకుందా అన్న చర్చ జరుగుతోంది. కర్నూలు హైకోర్టు విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ నాయకులే దగ్గరుండి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని వాదిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ప్రభుత్వమే సుప్రీంకోర్టులో.. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్పడం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందన్న సందేహం రావడానికి కారణం అవుతోంది.