Vishnu Vardhan Reddy: తిరుపతి : ఏపీలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో పేద ప్రజలు అట్టడుగుకు వెళ్లిపోతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నాడు విఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడారు. 


ఏపీలో సామాన్యుల బతుకు మరింత భారంగా మారుతుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు కారణమని వ్యాఖ్యానించారు. సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని, సినిమాలు చూసే పరిస్థితి కూడా లేదన్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఇసుక, స్టీల్, సిమెంట్ కొనే పరిస్థితి ఏపీలో కనిపించడం లేదన్నారు. ప్రజలు కోరుకుంటోంది సినిమా టికెట్ల ధరలు కాదని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.


ఏపీ ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని, దేశంలోనే ఏ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు పెంచే విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. ఒక చేత్తో ఓటు బ్యాంకుకు తాయిలాలూ వేస్తూనే.. మరో చేత్తో నిత్యవసర సరుకుల ధరలు పెంచుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 30 నెలల్లో రాష్ట్రం ఎంతో వెనుకబడి పోయిందని.. కనీసం మిగిలిన 30 నెలల కాలంలోనైనా ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్లాలని కోరారు.


వన్ సైడ్ లవ్, టు సైడ్ లవ్‌పై క్లారిటీ..
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఆయా పార్టీలు ఎవరితో పెట్టుకుంటాయనేది ఇంకా తేలని సమయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారని చెప్పారు. అయితే కొన్ని ఇతర పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వన్ సైడ్ లవ్, టు సైడ్ లవ్ అని ఆశలు పెట్టుకున్న కొందరికి పవన్ నిర్ణయంతో స్పష్టత వచ్చిందన్నారు. బీజేపీ, జనసేన కలిసి 2024లో అధికారంలోకి వస్తాయన్న విష్ణువర్ధన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది బీజేపీ జాతీయ కార్యవర్గం నిర్ణయిస్తుందని వివరించారు.


 Also Read: MP Raghurama: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు.. Hydలోని ఇంటి ఎదుట హడావుడి


Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి! 


Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి