Ind vs SA 3rd Test: క్రమశిక్షణగా కోహ్లీ! అదృష్టమే కలిసిరాలేదన్న బ్యాటింగ్ కోచ్

కోహ్లీ క్రమశిక్షణతో బ్యాటింగ్‌ చేశాడని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. అదృష్టం కలిసొస్తే సెంచరీ కొట్టేవాడని పేర్కొన్నాడు. సఫారీ బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్‌ చేశారని ప్రశంసించాడు.

Continues below advertisement

కేప్‌టౌన్‌ టెస్టులో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అత్యంత క్రమశిక్షణతో బ్యాటింగ్‌ చేశాడని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. కాస్త అదృష్టం కలిసొస్తే అతడు సెంచరీ కొట్టేవాడని పేర్కొన్నాడు. సఫారీ బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్‌ చేశారని ప్రశంసించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 233 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ (79; 201 బంతుల్లో 12x4, 1x6) ఒంటరి పోరాటం చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా 17/1తో నిలిచింది.

Continues below advertisement

'విరాట్‌ బ్యాటింగ్‌ గురించి నేనెప్పుడూ ఆందోళన చెందను. ఎందుకంటే అతడు చాలా బాగా ఆడతాడు. అతడు నెట్స్‌లో చాలా బాగున్నాడు. మ్యాచులోనూ అంతే. అతడికి శుభారంభాలు లభిస్తున్నాయి. తొలిరోజు అతడి బ్యాటింగ్‌లో మార్పు ఏంటంటే మరింత క్రమశిక్షణగా బ్యాటింగ్‌ చేయడం. క్రీజులో దృఢంగా నిలబడ్డాడు. కాస్త అదృష్టం కలిసొస్తే సెంచరీ చేసేవాడు. ఏదేమైనా అతడి ఆటను చూసి ఆనందిస్తున్నా' అని విక్రమ్‌ తెలిపాడు.

'క్రికెట్లో సర్దుబాట్లు నిరంతరం జరుగుతుంటాయి. మరీ ఎక్కువ మార్పులైతే ఉండవు. అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్‌ టెక్నిక్‌లో కొన్ని మార్పులు అవసరం అవుతుంటాయి. పుజారా తన స్టాన్స్‌ను కాస్త లెగ్‌సైడ్‌ మార్చుకున్నాడు. అదే అతడికి సాయపడింది. ఇక విరాట్‌కు దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమశిక్షణగా బౌలింగ్‌ చేశారు. అతడు డ్రైవ్‌, పుల్‌ చేయడానికి వీలవ్వలేదు. అతడు ఔటయ్యేంత వరకు బంతిని జాగ్రత్తగా చూశాడు. చివరి గేమ్‌లో అతడు దూరంగా వెళ్తున్న బంతిని ఆడి ఔటయ్యాడు. ప్రస్తుత టెస్టులో మాత్రం దేహానికి దగ్గరగా వచ్చిన బంతుల్నే డ్రైవ్‌ చేశాడు' అని రాఠోడ్‌ చెప్పాడు.

Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!

Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం

Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?

కేప్‌టౌన్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మరో 50-60 పరుగులు చేసుంటే బాగుండేదని విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. చల్లని వాతావరణం, మబ్బులు ఉన్నప్పుడు ఆడటం కష్టమన్నాడు. పుజారా, కోహ్లీ విలువైన పరుగులు చేశారని ప్రశంసించాడు. ఈ సిరీసులో అజింక్య రహానె కొన్ని చక్కని ఇన్నింగ్సులు ఆడాడని వెల్లడించాడు. అతడు తన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉందని పేర్కొన్నాడు. విలువైన ఆటగాళ్లకు జట్టు యాజమాన్యం మరో అవకాశం ఇస్తూనే ఉంటుందని తెలిపాడు.

 

Continues below advertisement