Lokesh Padayatra Tension : చిత్తూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బంగారుపాళ్యంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. సెంటర్ లైన్లో సభ నిర్వహించవద్దని మరోచోట నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులకు తీరుకు నిరసనగా నేలపైనే కూర్చుని లోకేశ్, టీడీపీ నేతలు నిరసన తెలిపారు. బహిరంగ సభను అడ్డుకున్న పోలీసు తీరుపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరు ఏం చేసినా యువగళం ఆపలేరని లోకేశ్ అన్నారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పిన లోకేశ్, పక్కనున్న భవనంపై నుంచి ప్రసంగించారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహణకు ప్రయత్నం చేయడంతో టీడీపీ ప్రచార రథాన్ని సీజ్ చేశామని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రచార వాహనం సీజ్ చేసినప్పుడు పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 


పలమనేరులో కూడా  


 చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రచార రథాన్ని ఇటీవల పోలీసులు సీజ్ చేశారు. పలమనేరు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రచార రథంపై నుంచి టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ ప్రసగించేందుకు ప్రయత్నించగా అనుమతి లేకుండా బహిరంగ సభలో ప్రసంగించారంటూ పోలీసులు ప్రచార వాహనాన్ని  సీజ్ చేశారు. తమ వాహనాన్ని అడ్డుకోవడంపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఎందుకు వాహనాన్ని సీజ్ చేస్తున్నారంటూ పోలీసులు తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.  పోలీసులపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనంతరం వాహనాన్ని పోలీసులు వదిలిపెట్టారు.   


ఎనిమిదో రోజు లోకేశ్ పాదయాత్ర 


 చిత్తూరు జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది. పూతలపట్టు నియోజకవర్గం మొగిలి ఈశ్వరాలయం నుంచి యాత్ర ప్రారంభమైంది. టీడీపీతో తిరిగితే చంపేస్తామని సీఐ ఆశీర్వాదం బెదిరిస్తున్నారని స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. తమపై దాడి చేసి, తిరిగి జైలుకు పంపారని ఆవేదన చెందారు. పుంగనూరులో వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని లోకేశ్ వద్ద టీడీపీ నేతలు మొరపెట్టుకున్నారు. పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రొంపిచర్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన చెందారు. జనవరి 7న తమపై బీరుబాటిళ్లతో వైసీపీ నేతలు  దాడి చేశారన్నారు టీడీపీ నేతలు తెలిపారు. వైసీపీ జడ్పీటీసీ రెడ్డిఈశ్వరరెడ్డి తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. టీడీపీ బ్యానర్లను చింపేస్తూ  తమను రెచ్చగొడుతున్నారని అన్నారు. టీడీపీ నేతల ఆవేదనపై లోకేశ్ స్పందిస్తూ... పార్టీ అందరి త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటుందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దామన్నారు. పార్టీ కోసం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని లోకేశ్ సూచించారు. పుంగనూరు పుడింగి సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేద్దామన్నారు. పసుపుజెండాను పుంగనూరులో ఎగరేద్దామని స్థానిక నేతలతో అన్నారు. అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులను ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. భయం టీడీపీ బయోడేటాలో లేదనేది లోకేశ్ అన్నారు.