ASI Drunken With Villagers In Prakasam: ఓ పోలీస్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించాడు. గ్రామంలో బందోబస్తుకు వెళ్లిన సదరు అధికారి డ్యూటీ పక్కన పెట్టి గ్రామస్థులతో మద్యం సేవించాడు. గ్రామ శివారుల్లో ఆ పోలీస్ కొందరు ఎంజాయ్ చేస్తుండగా తీసిన వీడియో వైరల్‌గా మారింది. ఇది ఉన్నతాధికారులకు చేరడంతో ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. ప్రకాశం (Prakasam) జిల్లా ముండ్లమూరు మండల పరిధిలోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఇటీవలే రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడగా.. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోసారి ఎలాంటి వివాదాలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.


గ్రామస్థులతో మందేస్తూ..


గ్రామంలో ఏఎస్సై వెంకటేశ్వర్లుకు విధులు కేటాయించారు. అయితే, విధి నిర్వహణను మరిచిన సదరు పోలీస్ అధికారి గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. మందుబాబుల్లో ఒకరు డ్యాన్స్ చేస్తుంటే ఈలలు వేస్తూ ఎంకరేజ్ చేశాడు. ఈ తతంగాన్ని ఓ మందుబాబు వీడియో తీసీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. ఇది వైరల్‌గా మారగా.. విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో సదరు ఏఎస్సైను ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సస్పెండ్ చేసి వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలుస్తోంది.


Also Read: Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి