కేంద్రం ఇటీవల పెట్రోల్, డీజిల్ లపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని సూచించింది. దీనిపై ఏపీ, తెలంగాణ భిన్నంగా స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పెంచేది, తగ్గించేది లేదని తేల్చిచెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం అబద్ధాలు చెబుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. 2014లో క్రూడాయిల్‌ ధర 105 డాలర్లు ఉంటే ఇప్పుడు 83 డాలర్లు ఉందన్నారు. బ్యారెల్‌ ధర 30 డాలర్లు ఉన్నప్పుడు కూడా కేంద్రం భారీగా సుంకాలు వేసిందన్నారు. కేంద్రం రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ సెస్‌ పెంచిందని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ తగిలిన దెబ్బలతో ఇంధన ధరలను పిసరంత తగ్గించారన్నారు. బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదన్న సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే ఊరుకోమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రంలో వ్యాట్‌ ఒక్క రూపాయి కూడా పెంచేది, తగ్గించేది లేదన్నారు. క్రూడాయిల్ పై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 


పెట్రో ధరల తగ్గింపుపై ఏపీ వైఖరి


తాజాగా ఏపీ మంత్రులు కూడా పెట్రో ధరలు తగ్గించమని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు. పెట్రోల్‌ ధరను రూ.116 వరకూ తీసుకెళ్లింది కేంద్రమే అని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రూ.70 ఉండాల్సిన పెట్రోల్‌ ధరను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సెంచరీ కొట్టించిదని ఆరోపించారు. ప్రజలకు ఏం గుర్తుండదని బీజేపీ నేతలు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 తగ్గించామని కేంద్రం చెబుతుందని, కానీ ధరలు ఇంతలా పెరగడానికి కేంద్రమే కారణమన్నారు. ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.1 సెస్‌ వేశామని మంత్రి తెలిపారు. కేంద్రం రూ.2.87 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేస్తోందన్నారు. 






Also Read: ఏపీకి పాలు సరఫరా బంద్.... రూ.130 కోట్ల బకాయిలు చెల్లించండి... ఏపీకి కర్ణాటక లేఖ


టీడీపీ ప్రభుత్వంలో 31శాతం పన్ను


ఏపీలో ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలు దిల్లీలో ధర్నాలు చేయాలని మంత్రి పేర్ని నాని సూచించారు. పెంచిన వాళ్లే పెట్రో ధరలు తగ్గించాలన్నారు. గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ఇప్పుడు లీటరుకు రూ.5, రూ.10 తగ్గిస్తారా అని ప్రశ్నించారు. లీటరుకు రూ.30 తగ్గించాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. కేంద్రం దొంగచాటుగా వేస్తున్న పన్నులను రాష్ట్రాలు గమనిస్తున్నాయన్నారు. టీడీపీ పాలనలో పెట్రోల్‌పై 31 శాతం పన్ను, ప్రత్యేక సర్‌ఛార్జ్ విధించారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని మంత్రి అన్నారు. 


Also Read: ఏపీ, తెలంగాణకు కేఆర్ఎంబీ ఛైర్మన్ లేఖ.... శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు అప్పగించాలని ఆదేశాలు


పెట్రో ధరలు తగ్గించే ఆలోచన లేదు : ఆర్థిక మంత్రి బుగ్గన


రాష్ట్రంలో పెట్రో ధరలను తగ్గించే ఆలోచన లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ధరల తగ్గింపునకు కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు లేదన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అనంతరం మాట్లాడిన ఆయన అన్ రాక్ ఆర్బిట్రేషన్ పరిష్కారంపై కేంద్రమంత్రితో చర్చించానన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలపై ఏపీ నిర్ణయాన్ని ఇప్పటికే స్పష్టం చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక వనరుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని బుగ్గన గుర్తుచేశారు. కేంద్రమే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి పెట్రోల్, ఎక్సైజ్ ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందన్న ఆయన కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు. 


Also Read:  కేసీఆర్‌ని టచ్‌ చేసి బతికి బట్టకడతారా... రేపట్నుంచి కేంద్రానికి చుక్కలు చూపిస్తాం.... సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి