ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించకపోతే పాల సరఫరా నిలిపివేస్తామని కర్ణాటక స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం రూ.130 కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ అంగన్వాడీలకు పాలు సరఫరా చేయలేమని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(KMF) సోమవారం తేల్చిచెప్పింది. ఇకపై పాల ధరను కూడా లీటరుకు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏపీలో సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్వాడీలకు అందించే పాలు ఏపీ ప్రభుత్వం 2020 జూన్‌లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో ఒప్పందం చేసుకుంది. అంగన్వాడీలలో సంపూర్ణ పోషణ పథకం ద్వారా చిన్న పిల్లలకు పాలు అందిస్తున్నారు. ఈ కారణంతో లీటర్‌ ధరపై రూ.5 తగ్గించేందుకు అప్పట్లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి నెలా 110 లక్షల లీటర్ల పాలను ఏపీ ప్రభుత్వానికి కేఎంఎఫ్‌ సరఫరా చేస్తుంది. 


Also Read: ఆయన కంఠంలో ‘ఉక్కు’ తూటా! స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోపోరుకు సిద్ధమైన శంకరరావు..


ఏపీ ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు


కానీ గత నాలుగు నెలలుగా ఏపీ ప్రభుత్వం కేఎంఎఫ్‌కు ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీంతో బకాయిలు పేరుకుపోయి రూ.130 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలపై కేఎంఎఫ్ ఏపీ సర్కారుకు లేఖలు కూడా రాసింది.  అయినా ఏపీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీసీ సతీశ్‌ పాల సరఫరా నిలివేయాలని నిర్ణయించారు. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం, ఇతర ఖర్చులతో ఏపీ ప్రభుత్వానికిచ్చే రూ.5 సబ్సిడీని కూడా తొలగించాలని కేఎంఎఫ్ నిర్ణయం తీసుకుంది. పాల సబ్సిడీ తొలగింపుపై కూడా ప్రభుత్వం స్పందించలేదని కేఎంఎఫ్ తెలిపింది. 


Also Read: నెల్లూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ... నామినేషన్లు తిరస్కరించారని ఆందోళన.. ఆర్వో తీరుపై టీడీపీ ఫిర్యాదు


నష్టాల్లో పాల యూనియన్లు


పెట్టుబడి ఖర్చులు, ఇంధన ధరలు పెరిగిపోవడంతో కర్ణాటకలోని పాల యూనియన్లు నష్టాల్లో కురుకుపోయాయని కేఎంఎఫ్ తెలిపింది. అందువల్ల పాల ధరపై సబ్సిడీలు ఇవ్వలేకపోతున్నామని స్పష్టం చేసింది. పాత ధరకు పాలు సరఫరా చేయడం కుదరదని తెలిపింది. ఏపీ ప్రభుత్వం బకాయిలు పడ్డ కారణంగా పాల ఉత్పత్తిదారులకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని తెలిపింది. అందువల్ల ఏపీ ప్రభుత్వం రూ.130 కోట్ల బకాయిలు చెల్లించడంతో పాటు పాల ధరను లీటరుకు రూ.5 పెంచితేనే ఇక మీదట పాలు సరఫరా చేస్తామని కేఎంఎఫ్‌ ఎండీ సతీశ్‌ ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు.


Also Read: అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి