Breaking News Live Telugu Updates: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, ముసాయిదా రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు మునిసిల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కౌన్సిలర్ల వరుస రాజీనామాల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసినట్లు డీటీసీపీ అధికారులు తెలిపారు. రేపు రైతులు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
అవయవదానానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ పోలీసులు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. మలక్ పేటలోని యశోద ఆస్పత్రి నుంచి లంగ్స్, హార్ట్ ను తీసుకుని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి కేవలం 12 నిమిషాల్లో చేరవేశారు. ఈ రూట్‌లో నగర ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. మలక్‌పేట నుంచి కిమ్స్ ఆస్పత్రి మధ్య ఉన్న 11 కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్ కేవలం 12 నిమిషాల్లో చేరుకుంది. హార్ట్, లంగ్స్‌ను తీసుకుని అంబులెన్స్‌లో ఉదయం 10.59 గంటలకు బయలు దేరి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు 11.11 నిమిషాలకు చేరుకుంది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులకు ఆయా ఆస్పత్రుల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా దుకాణంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకొని మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనస్థలిగా చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో దుకాణంలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలను అదుపు చేసే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ప్రధాన రహదారి వైపు వాహనాలను దారి మళ్లించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో లోపల ఎవరూ లేనట్లు సమాచారం తెలుస్తుంది.
కరీంనగర్ లోని రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్లో కుళ్ళిన చికెన్ రావడంతో ఓ కస్టమర్ ఆందోళనకు దిగాడు. పార్సిల్ కోసమని బిర్యానీ ఆర్డర్ చేయగా సిబ్బంది చెడిపోయిన చికెన్ తో కూడిన పార్సిల్ ఇచ్చారని సదరు వ్యక్తి ఆరోపిస్తున్నాడు.
మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
ఎట్టకేలకు ఈనెల 16న కేసు నమోదు చేసిన సత్తెనపల్లి పోలీసులు
నిషేధిత లాటరీ చట్టాన్ని ఉల్లంఘించారని మంత్రి అంబటి రాంబాబుఫై అభియోగం
సంక్రాంతి సంబరాలలో లాటరీ లక్కీడ్రా ఏర్పాటు
వాలింటీర్లు, సచివాలయ సిబ్బంద్, వైసీపీ శ్రేణులతో భారీగా టిక్కెట్లు విక్రయించారని అభియోగం..
అంబటి గ్యాబ్లింగ్ ను ప్రోత్సహించాడని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జనసేన జిల్లా అద్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు.
న్యాయస్థానం అదేశాలతో అంబటిపై కేసు నమోదు..
Background
తెలుగు రాష్ట్రాలకు ఈ జనవరి చివరి వారంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా వర్ష సూచన ఏర్పడుందని వివరించారు. ప్రస్తుతం శ్రీలంకను ఆనుకొని ఓ ఉపరితల ఆవర్తన ప్రాంతం తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో వచ్చే 5 రోజులు ఎలాంటి వర్షాలు ఉండే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. పశ్చిమ గాలుల ప్రభావం బలపడుతుండడంతో పొడిగాలులు తమిళనాడు, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉంటాయని చెప్పారు. కాబట్టి, ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని, కానీ తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.
‘‘ఎప్పుడైనా చలి కాలం నుంచి ఎండా కాలం వెళ్లే కాలంలో కొన్ని వర్షాలు పడటం చాలా సహజం. గత పది సంవత్సరాల్లో ప్రతి సారి మనం జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఏదో ఒక నెలలో వర్షాలను చూశాము. ఈ సారి జనవరి చివరి వారంలో కొన్ని వర్షాలకు సంకేతాలు కనబడుతోంది. సాధారణంగా జనవరి చివరి వారానికి చలి తగ్గుముఖం పడుతూ మెల్లగా పగటి సమయంలో వేడి పెరుతుంది, అలాగే రాత్రి చల్లగా ఉంటుంది.
పశ్చిమ గాలుల ప్రభావం అంటే..
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మనకు ఎలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, అలాగే హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడ భూమిలోనే అల్పపీడనాలు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే చిన్నగా పశ్చిమ గాలులు అని అనవచ్చు. ఇది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం భాగా ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.
ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. సోమవారం (జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్ స్పెల్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్ స్పెల్‌లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి.
రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో నేడు కూడా అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. సాధారణంగా 11 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.
హైదరాబాద్‌లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. నగరంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30.4 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -