Pawan Kalyan Visited Manyam District: గత వైసీపీ హయాంలో రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టారు కానీ.. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రోడ్లు మాత్రం వేయలేకపోయారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా (Manyam District) సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. 'కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో సుమారు రూ.38.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర నూతన రోడ్ల నిర్మాణం చేపడుతోంది. తద్వారా 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలుగుతుంది. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలని తిరుపతి కొండ ఎక్కినప్పుడు మొక్కుకున్నాను. 2017 పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు చూశాను. తాగునీరు, రహదారులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నాం. సుందర జలపాతాలున్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవాలి.' అని పవన్ పేర్కొన్నారు.


'3 దశల్లో రోడ్ల అభివృద్ధి'


రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 3 దశల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సాలూరు నియోజకవర్గంలో బాగుజోల – సిరివర రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం గిరిజనులతో ఆయన మాట్లాడారు. 'దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైనా ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక సకాలంలో వైద్య సదుపాయం అందక అడవి బిడ్డలు మృత్యువాత పడడం కలిచివేసే విషయం. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ నిరక్ష్యరాస్యత, పేదరికం, ఆకలికేకలు, అనారోగ్యం పట్టిపీడుస్తున్నాయి. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 2 నెలలకు ఓసారి కచ్చితంగా పర్యటించి సమస్యలు తెలుసుకుంటాను.' అని పవన్ స్పష్టం చేశారు.


గిరిజనులతో మాటామంతీ.. 


అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించబోయే రోడ్లకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ తిలకించారు. శంకుస్థాపన చేసిన ప్రదేశం నుంచి సిరివర వెళ్లే కొండ ప్రాంతం మీదకు ఉన్న కచ్చా రోడ్డును పరిశీలించేందుకు కాలినడకన వెళ్లారు. స్వయంగా గిరిజన నివాస ప్రాంతాలకు వెళ్లి వారితో మాట్లాడారు. అనంతరం బాగుజోల గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 'రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన గ్రామాలకు సంబంధించి తీసుకొచ్చిన రూ. 690 కోట్లు ఎక్కడికి వెళ్లాయో తెలియదు. గత పాలకులు గిరిజనుల బతుకులు, వారి వెతలు తెలుసుకున్నదే లేదు. నేను వెంటనే అద్భుతాలు చేస్తానని చెప్పటం లేదు. ఒక సంవత్సరంలో గిరిజన ప్రాంతాల్లో మార్పు అనేది కచ్చితంగా చూపిస్తాను. గిరిజన ప్రజల కోసం ఎండనకా... వాననకా పనిచేస్తాం' అని చెప్పారు. 

 

'పర్యాటక అభివృద్ధితో యువతకు ఉపాధి'

 

యువత ప్రతి అంశంలోనూ నైపుణ్యం పెంచుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. 'ఇక్కడి ప్రకృతి రమణీయత చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ఇలాంటి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి కలుగుతుంది. పర్యాటకులు, ప్రకృతిపై అధ్యయనం చేసే వారు ఇటుగా వస్తే గిరిజనుల జీవన శైలి మెరుగవుతుంది. టూరిజం ద్వారా జీవన స్థితిగతులు మెరుగవుతాయి. దీని కోసం ఆలోచన చేస్తాం. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని జీవనోపాధి కేంద్రంగా తయారు చేస్తాం. ఇక్కడి వనరులు, వ్యవసాయ ఫలాలు స్థానికులకు దక్కేలా ప్రయత్నం చేస్తాం. హోంస్టే ఏర్పాట్లతో పాటు ప్రకృతిని ఆస్వాదించే టూరిజానికి ప్రోత్సాహం అందించడం ద్వారా మరింత ముందుకు వెళ్లొచ్చు.' అని పేర్కొన్నారు.