Prestigious University In AP: ఏపీలో మరో ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ యూనివర్శిటీ (Innovation University) ఏర్పాటు కానుంది. ఈ మేరకు డీప్ టెక్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వం 2 ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ కంపెనీతో ఒప్పందం చేసుకోగా.. తన భాగస్వామి అమెజాన్ వెబ్‌తో కలిసి రాష్ట్రంలో AI - ఫోకస్డ్ ఫస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE)... యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ (UoI)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే, రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్‌తో (TBI) మరో ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో ఫిజిక్స్ వాలా, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వేర్వేరుగా ఎంఓయు చేసుకున్నారు. యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


కాగా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ వర్శిటీ అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్‌ను ఏకీకృతం చేసే దిశగా పని చేస్తుంది. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. హబ్- అండ్ - స్పోక్ మోడల్‌ను అనుసరించి ఇన్నోవేషన్ యూనివర్శిటీ సెంట్రల్ హబ్‌గా పని చేస్తుంది. దీని ద్వారా విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సమకాలీన, హైబ్రిడ్ విద్యను యాక్సెస్ చేస్తారు. ఆన్‌లైన్, వ్యక్తిగత అభ్యసన అనుభవాలను ఇంటిగ్రేట్ చేస్తారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి పరిశ్రమ భాగస్వామితో ఫిజిక్స్ వాలా కలిసి పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ వాలా ఫౌండర్ & సిఇఓ అలఖ్ పాండే, కో ఫౌండర్ ప్రతీక్ బూబ్, పిడబ్ల్యు ఫౌండేషన్ హెడ్ విజయ్ శుక్లా, డైరక్టర్ సోన్ వీర్ సింగ్, హెడ్ ఆఫ్ ఇన్నొవేషన్స్ దినకర్ చౌదరి పాల్గొన్నారు.


'ప్రపంచ స్థాయి ప్రమాణాలతో శిక్షణే లక్ష్యం'


కృత్రిమ మేథ (ఏఐ)లో రాష్ట్ర యువతను నెం.1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగాయని మంత్రి లోకేశ్ అన్నారు. అధునాతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, అందుకు యువతను సన్నద్దం చేయడమే తమ లక్ష్యమన్నారు. పరిశ్రమల డిమాండ్, ప్రమాణాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్‌పై యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ దృష్టి సారిస్తుందని చెప్పారు. టాలెంట్ డెవలప్‌మెంట్, నాలెడ్జి క్రియేషన్‌లో ఏపీని బలోపేతం చేయాలని ఫిజిక్స్ వాలాను కోరారు. రాష్ట్రాన్ని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ఇందుకోసం ఏఐలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక, నెక్స్ట్ జనరేషన్ నైపుణ్యాలకు మార్గం సుగమం చేస్తున్నామని చెప్పారు. 


'రూ.1000 కోట్ల పెట్టుబడులు


ప్రభుత్వంతో తాము ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం ఏపీలో ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం స్థాపనలో తొలి అడుగు అని ఫిజిక్స్ వాలా (PW) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్‌పాండే అన్నారు. ఇందుకోసం యుఎస్ GSV వెంచర్స్, ఇతర పెట్టుబడిదారుల ద్వారా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. 'అకడమిక్ లెర్నింగ్‌ని ఇండస్ట్రీతో మిళితం చేసే సంస్థను రూపొందించడానికి యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్ పని చేస్తుందన్నారు.


మరోవైపు, ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దడమే టీబీఐతో ఒప్పందం ప్రధాన లక్ష్యమని టీబీఐ కంట్రీ డైరక్టర్ వివేక్ అగర్వాల్, అసోసియేట్ ముంజులూరి రాగిణి రావు అన్నారు. 'అంతర్జాతీయంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో చేయాల్సిన మార్పులపై TBI ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే విద్యా విధానాలు గుర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో తృతీయ విద్య ల్యాండ్ స్కేప్‌ను మెరుగుపర్చడానికి కృషి చేస్తుంది. రాష్ట్రంలో సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధికి వేదిక ఏర్పాటుకు అవసరమైన ఆవిష్కణలు ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో నైపుణ్య అంతరాలను గుర్తించి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్‌లను అమలు చేసేందుకు ప్రభుత్వంతో టీబీఐ కలసి పని చేస్తుంది. ఇందుకు అవసరమైన సమగ్ర రోడ్ మ్యాప్ అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది.' అని సంస్థ ప్రతినిధులు చెప్పారు.


Also Read: YSRCP On Amit Shah: అంబేద్కర్‌పై అమిత్ వ్యాఖ్యలను సమర్థించిన వైఎస్ఆర్‌సీపీ - అవమానించలేదని క్లారిటీ