Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 May 2022 07:26 PM
KA Paul : బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో శాంతియుతంగా ఉన్న అన్ని మతస్థులను, తన వ్యాఖ్యలతో బండి సంజయ్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో శాంతి లేకుండా చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం వెంటనే బండి సంజయ్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీని ఎన్టీఆర్ కుటుంబంలో ఒకరైన బాలకృష్ణకు గానీ జూనియర్ ఎన్టీఆర్ కు గానీ అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్యకు సీఎం జగన్ రాజ్యసభ సీటు ఇచ్చినంత మాత్రాన బీసీలందరూ ఓటేస్తారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. 

హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం

ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పథకం సాధించిన నిఖత్ జరీన్ మొదటిసారి హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆమెకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. నిఖత్ జరీన్ కు స్వాగతం పలికేందుకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఎయిర్ పోర్టుకు వచ్చారు.  బాక్సర్ నిఖర్ జరీన్ కు మంత్రులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.  

Mahanadu: పసుపు వర్ణమైన ఒంగోలు

ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.





Adilabad Woman Murder: నడిరోడ్డుపైనే యువతిని నరికి చంపిన దుండగులు

ఆదిలాబాద్ జిల్లాలో అతి కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపైనే ఓ యువతిని దుండగులు నరికి చంపారు. నార్నూర్ మండలం నాగోల్ కొండలో ఈ ఘటన జరిగింది. దీంతో రాజేశ్వరి అనే యువతి అక్కడికక్కడే చనిపోయింది. దీన్ని పరువు హత్యగా భావిస్తున్నారు. నెల రోజుల క్రితం యువతి మతాంతర వివాహం చేసుకుంది. అది కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా హత్య సంచలనం రేపుతోంది.

TDP Mahanadu 2022 Updates: ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది - చంద్రబాబు

‘‘ఎక్కడికక్కడ మహిళలపై దాడులు కూడా పెరిగిపోయాయి. ఇంట్లో ఉంటే కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. టీడీపీ హాయంలో ఇలాంటి ఘటన జరిగితే 20 టీమ్ లు ఏర్పాటు చేస్తే నిందితుడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అది టీడీపీ విధానం. ఎక్కడ చూసినా గంజాయి, మద్యం, డ్రగ్స్ అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. సంఘ విద్రోహశక్తులను పెంచి పోషిస్తున్నారు.’’ అని చంద్రబాబు విమర్శించారు.

Mahanadu News: ఇసుక ట్రక్కు అప్పుడు రూ.600, ఇప్పుడు రూ.5 వేలు - చంద్రబాబు

‘‘గతంలో రూ.600 ఉన్న ఇసుక ట్రక్కు రూ.5 వేలకి పెరిగిపోయింది. సిమెంటు ధరలు కూడా పెరిగిపోయాయి. నిర్మాణ రంగం కుదేలయింది. మొత్తం అవినీతి. రూ.8 లక్షల కోట్ల అప్పు చేరిపోయింది. ఏమైనా అభివ్రుద్ధి జరిగిందా అంటే ఎక్కడా లేదు. సంక్షేమం, అభివ్రుద్ధి ఏమీ లేకుండా ఏకంగా అప్పులు మాత్రం 8 లక్షల కోట్లకి చేరిపోయాయి. ఇలాంటి ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు లేనే లేదు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. ఇప్పుడు కేంద్రం వద్ద మెడలు దించి రాష్ట్రాల హక్కులు తాకట్టు పెట్టారు. పోలవరంకు నిధులు కూడా సాధించలేకపోయారు.’’

Chandrababu: అమ్మఒడి అన్నారు.. నాన్న బుడ్డి పెట్టారు - చంద్రబాబు

‘‘అమ్మఒడి అన్నారు.. నాన్న బుడ్డి పెట్టారు. అమ్మఒడి కంటే.. నాన్న బుడ్డితో కలెక్ట్ చేస్తున్నారు. మనం 52 శాతం సంక్షేమానికి ఖర్చు పెట్టాం. మీరు ఖర్చు పెడుతున్నది 41 శాతం మాత్రమే. ఇప్పుడు చేస్తున్న అప్పులు, బాదుడే బాదుడు ద్వారా వస్తున్న ఆదాయం ఎక్కడికి పోతుంది? అన్నా క్యాంటిన్లు, చంద్రన్న భీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య లాంటివి ఏమీ లేవు. అంతా మోసకారి సంక్షేమం. రైతులకు ఒకేసారి టీడీపీ రూ.50 వేలు రుణమాఫీ చేసింది. మీరు ఏమీ చేయలేదు.’’ అని చంద్రబాబు అన్నారు.

TDP Mahanadu Chandrababu Speech: పాలన చేతకాకపోతే, అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టుకోండి - చంద్రబాబు

‘‘మనం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం. ఈ మూడేళ్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనట్లుగా పన్నులు పెంచారు. భయంకరమైన బాదుడే బాదుడు.. ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఒక తప్పుని తప్పుగా ప్రశ్నిస్తే అవతలి వాళ్లు కరెక్ట్ చేసుకోలేని వాళ్లు చరిత్ర హీనులుగా మారిపోతారు. అలాంటి వాళ్లే వైఎస్ఆర్ సీపీ నాయకులు. పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం సహా అనేక రాష్ట్రాలు తగ్గిస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. గ్యాస్, కరెంటు ఛార్జీలు అన్ని బాదుడే బాదుడు. అన్నీ కరెంటు కోతలే. రాని కరెంటు కోసం అధిక ఛార్జీలు. పాలన చేతకాకపోతే, అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టుకొని పరిపాలన చేయండి. నీ వల్ల (సీఎం) ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు.’’

Mahanadu Live Updates: పోలీసులు ఉన్మాది చేతిలో బలి కావొద్దు - చంద్రబాబు

‘‘మన పోరాటం జగన్ రెడ్డితో కాదు. ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పోరాడుతున్నాం. దాంతో మనపైనే దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు భయం, టీడీపీ నేతలు కూడా భయంతో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే గొంతును నియంత్రించాలని చూస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తున్నారు. పోలీసులు కూడా వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యక్తిత్వం మార్చుకోకూడదు. మన హాయంలో ఇదే పోలీసులు శాంతిభద్రతలు పరిరక్షించారు. ఇప్పుడు పోలీసుల లాఠీలకు ఎవరూ భయపడేవాడే లేడు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకూ అందరూ ఆలోచించుకోండి. అనవసరంగా మీరు ఒక ఉన్మాది చేతిలో బలి కావొద్దు. జగన్ ను నమ్ముకొని గతంలో ఎంతో మంది అధికారులు జైలుకు పోయారు. భవిష్యత్తులో ఇలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదు’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

Chandrababu Speech in Mahanadu: ఇప్పుడున్న నాయకులు కరడుగట్టిన నేరస్థులు - చంద్రబాబు

‘‘చాలా దూర ద్రుష్టితో మన నాయకుడు పార్టీని రూపొందించారు. రైతు కోసం నాగలి. పేదవాడి కోసం గుడిసె, కార్మికుడి కోసం చక్రాన్ని తెలుగు దేశం లోగోలో చేర్చారు. అది ఎన్టీఆర్ ఆలోచనా విధానం. మూడేళ్లు మనం ఇబ్బందులు పడ్డాం. అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. వేదికపై నుంచే నాయకుల్ని అరెస్టు అయ్యారు. తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందులు వస్తున్నాయి. నేను నిద్రలు లేని రాత్రులు గడిపా. ఇంతకుముందు నాయకులు బాధ్యతతో ప్రవర్తించేవారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేవారు. ఈరోజు ఉన్న నాయకులు కరడు గట్టిన నేరస్థులు. తప్పులు చెప్పి రాజకీయం చెప్పే వ్యక్తులు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని విరోధులుగా చూస్తున్నారు.’’ అని చంద్రబాబు అన్నారు.

Chandrababu Speech in Mahanadu: ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి శాపంగా మారింది - చంద్రబాబు

మహానాడులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ‘‘రాజకీయాన్ని తమాషా అనుకోవద్దు. ఒక ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి శాపంగా మారింది. రాష్ట్రం పరువు పోయే పరిస్థితికి వచ్చింది. ఎన్నో రాజకీయాలు, పోరాటాలు, ముఖ్యమంత్రులను చూశాం. ఆంధ్రా చరిత్ర టీడీపీకి ముందు తర్వాత అని చెప్పుకొనే పరిస్థితి ఉంది.’’ అని చంద్రబాబు అన్నారు.

Mahanadu 2022 Updates: వైసీపీది ఆలీబాబా 40 దొంగల యాత్ర - అచ్చెన్నాయుడు

వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ బస్సు యాత్రపై ఘాటు విమర్శలు, ఆరోపణలు చేశారు. ‘‘వైసీపీ తరహాలో టీడీపీ గాలికి పుట్టలేదు. మన పార్టీని వారు ఏమీ చేయలేరు. ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమంతో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. వైసీపీ బస్సుయాత్రం అంతా బూటకం. అలీబాబా 40 దొంగల తరహాలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో పాల్గొంటున్నది మంత్రులు కాదు.. బస్సు యాత్ర చేస్తున్న వారంతా దోపిడీ దొంగలు. ప్రజల్లోకి వస్తున్న వైసీపీ మంత్రుల్ని ప్రజలు నిలదీయాలి’’ అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Mahanadu: మహానాడు వేదికకు చేరుకున్న చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ పండుగ మహానాడు ప్రారంభం అయింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి జ్యోతి ప్రజ్వలనం చేశారు.

Warangal Fire Accident: వరంగల్‌లో భారీ అగ్ని ప్రమాదం, రెస్టారెంట్ కాలి బూడిద

వరంగల్‌ లో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మను ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో రెస్టారెంట్‌ పూర్తి స్థాయిలో కాలిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ ముందు క్లాత్‌తో చేసిన డెకరేషన్‌కు మొదట మంటలు అంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి చేశాయి. రెస్టారెంట్ కింద ఉన్న బిగ్ సీ మొబైల్‌ షాప్‌లోకి మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

Background

పసుపు పండగ నేటి నుంచే ప్రారంభం. 2024 ఎన్నికలకు నేతలను, కార్యకర్తలను సిద్ధం చేసేందుకు తెలుగు దేశం రెడీ అయింది. ఒంగోలు వేదికగా రెండు రోజు పాటు నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధమైంది.


ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ పెను సంచలనం. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి 40 ఏళ్లల్లో ఎన్నో ఘన విజయాలు సాధించింది. అంతకు మించిన సంక్షోభాలను కూడా ఎదుర్కొంది. 


తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అలాంటి పరీక్షలనే ఎదుర్కొంటోంది. అందుకే మరోసారి వారిలో ఉత్తేజం నింపి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఓవైపు కేసులు మరోవైపు నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. 


కీలకమైన నేతలు చాలా మంది ఇప్పటికి కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల బెడద ఎక్కువైందని... అందుకే చాలా మంది నాయకులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదని టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో నేతల్లో, శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి పోరాటాలు చేస్తే పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలని చూస్తోంది టీడీపీ. 


మొన్నటికి మొన్న చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లింది. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని.. పార్టీ విశ్లేషిస్తోంది. ఇన్నాళ్ల నుంచి పార్టీపై ఉన్న అపోహ తొలగిపోయిందని అంటున్నారు నేతలు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేపట్టేందుకు కార్యాచరణ తీసుకునే ఆవకాశం కూడా ఉంది. 


కరోనా టైంలో అన్‌లైన్‌లో మహానాడు నిర్వహించిన తెలుగుదేశం... 2018 తర్వాత తొలిసారిగా అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఒంగోలులో జరిగే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నేతలు తరలి వచ్చారు. 


8.30 గంటలకు ప్రతినిధులు నమోదుతో మహానాడు ప్రారంభమవుతుంది. తర్వాత ఉదయం 10 గంటలకు ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి... మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాప తీర్మానం ప్రవేశ పెడతారు. 11.45కు  చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. తర్వాత తీర్మానాలపై చర్చ జరుగుతుంది. మొత్తం  17 తీర్మానాలు ప్రవేశ పెడతారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ తీర్మనాలే ఎక్కువగా ఉంటాయి. 


 


నేటి నుంచి రెండు రోజుల పాటు (మే 27, 28) ఒంగోలు సమీపాన మండువారిపాలెంలో జరిగే మహానాడు కార్యక్రమం దృష్ట్యా వాహనాల రాకపోకలకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా జిల్లా ఎస్పీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాబట్టి, ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను అనుసరించి ఇబ్బంది లేకుండా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.


మహానాడు కార్యక్రమానికి వచ్చే వాహనాల కోసం మార్గాలు
1. గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుండి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్ లో ఎంటర్ ఆయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణు ప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళాలి.


2. నెల్లూరు, కావలి వైపు నుండి మహానాడుకు వచ్చే వాహనాలు ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించకుండా పెళ్లూరు ఫ్లైఓవర్ ఎక్కి కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ బైపాస్ పాస్ మీదగా విష్ణు ప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళవలెను.


3. కడప, కర్నూలు, చీమకుర్తి వైపునుండి మహానాడుకు వచ్చే వాహనాలు కర్నూల్ బై పాస్ సెంటర్ మీదగా సర్వీస్ రోడ్డు ద్వారా విష్ణు ప్రియ కల్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియా కు ఎంట్రీ అయి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళాలి.




 



4. కొత్తపట్నం వైపు నుండి వచ్చే వాహనాలు కొప్పోలు ఫ్లైఓవర్ మీదగా కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ పాస్ మీదగా విష్ణు ప్రియ కల్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్ కు వెళ్ళాలి.


5. విజయవాడ, గుంటూరు, చీరాల వైపునుండి ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించే వాహనదారులు కిమ్స్ ఫ్లైఓవర్ మీదగా కొప్పోలు ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు మీదగా కొత్తపట్నం బస్టాండ్ మీదుగా ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించాలి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.