AP Minister Parthasarathy about AP Cabinet Decisions | అమరావతి: వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా విద్యా రంగానికి తీవ్రమైన నష్టం చేసిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఐదు ప్రధాన ఫైళ్లపై సంతకాలు చేశారు. నేడు జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో అందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకిగానూ మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో ఎస్జీటీ, టీజీటీ, ఇతరత్రా పోస్టులు ఉన్నాయి. డీఎస్సీకి క్వాలిఫికేషన్ అంటే టెట్ క్వాలిఫై అవ్వాలి. 80 శాతం డీఎస్సీ మార్కులు, 20 శాతం టెట్ మార్కులు పరిగణిస్తారు. కానీ జగన్ ప్రభుత్వం చివరిసారిగా టెట్ నిర్వహించింది, డీఎస్సీ నిర్వహించకపోవడంతో టీచర్ పోస్టుల కోసం చూస్తున్న నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. 


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ఈ చట్టం పేరు చెప్పగానే భూ యజమానులు పిడుగుపడ్డట్లుగా భయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కేంద్రం తెచ్చిన చట్టంలో జగన్ ప్రభుత్వం మార్పులు చేసిందని ఆరోపించారు. ఎన్డీయే సర్కార్ తెచ్చిన చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని అమల్లోకి తేవడంతో సన్న, చిన్నకారు రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. పాస్ బుక్ లపై జగన్ ఫొటో పెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కేంద్రం తెచ్చిన చట్టంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంటే, దానికి బదులుగా ఎవరైనా వ్యక్తి అని జగన్ సర్కార్ మార్చింది. ఏదైనా వివాదం తలెత్తితే ఎక్కడ అప్పీల్ చేసుకోవాలో కూడా చెప్పలేదు. దీనిపై ప్రజలు హైకోర్టును ఆశ్రయించాలని వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా చేయడం సాధ్యమైనా అని కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. దోపిడీ చేసేందుకు వైసీపీ అమలు చేసిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సైతం భూయజమానుల వద్ద ఉండవు అని చెప్పడం వారిలో భయాన్ని పెంచింది.


సామాజిక భద్రత పెన్షన్లు
65 లక్షల మందికి 28 కేటగిరీలలో పలు వర్గాలకు ఇస్తున్న సామాజిక భద్రత పింఛన్ ను పెంచినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. పింఛన్ ను రూ.3000 నుంచి రూ.4 వేలకు పెంచినట్లు చెప్పారు. జులై 1నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం 10, 15 రోజుల్లో నిర్ణయం అమలు చేసిందన్నారు. సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఉదయం 6 నుంచి సాయంత్రం లోగా లబ్ధిదారులకు పింఛన్ అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. దివ్యాంగులకు రూ.3 నుంచి రూ.6 వేలకు పింఛన్ పెంచారు.


పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యంతో ఉన్నవారికి పింఛన్ రూ.5 వేల నుంచి రూ.10 వేలు అందిస్తామని పేర్కొన్నారు. మూడు నెలల బకాయి పెన్షన్ ను ఒకేసారి జులై 1న రూ.7 వేలు పింఛన్ అందిస్తామని పార్థసారథి తెలిపారు. పెంచిన పెన్షన్లతో రూ.819 కోట్లు ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లకు ఏడాదికి రూ. 23,272.44 వెచ్చించగా, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి రూ. 33,099 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. 


స్కిల్ డెవలప్ మెంట్..
స్కిల్ డెవలప్‍మెంట్‍కు తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉన్నత చదవులు చదివినా జాబ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ లేకపోవడంతో యువత ఉద్యోగాన్ని తెచ్చుకోలేకపోతుంది. దాంతో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమంతో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం.. వ్యవసాయరంగంలోనూ నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ డెవలప్‍మెంట్ అమలు చేయడానికి తీర్మానం చేసినట్లు పార్థసారథి తెలిపారు. 



అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ
ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా అన్నా క్యాంటీన్లను చంద్రబాబు గత ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఆపై అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అన్నా క్యాంటీన్లు పున ప్రారంభించి పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభిస్తాం. మిగతా 20 అన్నా క్యాంటీన్లను త్వరలో ప్రారంభించాలని కేబినెట్ ఆమోదించింది. ప్రపంచంలో పేరున్న సంస్థల నుంచి టెండర్లు స్వీకరించి ఆగస్టులో ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.