Telangana Congress Updates :  తెలంగాణ సీఎం , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కంటే ముందే పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ ఆమోదం  కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. 


మంత్రివర్గ విస్తరణపై అనుమతి తీసుకునే చాన్స్                                   


మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో నాలుగైదు స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. గతంలోనే హైకమాండ్ నుంచి అనుమతి తీసుకున్నారు. ఎవరెవరికి చాన్స్ ఇవ్వాలన్నదానిపై కసరత్తు జరిపిన రేవంత్ రెడ్డి ఆ మేరకు జాబితాతో హైకమాండ్ వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ అనుమతి తీసుకుని వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత వివిధ మంత్రుల శాఖలను కూడా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. 


పీసీసీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చ                  


ముఖ్యమంత్రిగా ఉంటూనే ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కూడా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆయన పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలిగి పార్టీ కోసం పని చేసే సీనియర్ నేతకు చాన్సివ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలో పీసీసీ పదవి కోసం పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. తన సోదరుడిని మంత్రిని చేసి తనను పీసీసీ చీఫ్ ను చేయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ సారి మహిళా, గిరిజన వర్గాలకు అవకాశం ఇస్తే మంచిదని సీతక్క పేరును ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీతక్క కూడా ఢిల్లీ చేరుకున్నారు. మొత్తంగా పీసీసీ చీఫ్ ఎంపికపై హైకమాండ్ ఆలోచనలో ఎలా ఉన్నాయో.. కూడా ఈ సమావేశం తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


చేరికలపైనా హైకమాండ్ తో చర్చలు                           


తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసులు ఉన్నాయి. ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేల చేరిక ఉండే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారికి మరో చాయిస్ లేకుండా వెంటనే కండువా కప్పేస్తున్నారు. మిగతా వారిని అందర్నీ ఒకే సారి పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు. ఎవరెవరు పార్టీలో చేరుతారన్న అంశంపై హైకమాండ్‌కు రేవంత్ రెడ్డి నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.