18th Loksabha Session Started: 18వ లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ సహా ఇతర ఎంపీలతో నూతన లోక్ సభ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేస్తారు. తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తి కానుంది. అంతకు ముందు ప్రొటెం స్పీకర్‌తో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ హాజరయ్యారు.
'ఎంపీలందరికీ స్వాగతం'
ఇది చాలా పవిత్రమైన రోజు అని.. ఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నా అని పీఎం మోదీ అన్నారు. సమావేశాలకు ముందు పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 'ఎంపీలు ప్రజలు ఆకాంక్షల్ని నెరవేర్చాలి. మాకు వరుసగా మూడోసారి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశా. కొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నాం. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటాం. సభ్యుందరినీ కలుపుకొని వికసిత్ భారత్ మన సంకల్పం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని మనమంతా ముందుకెళ్దాం' అని పేర్కొన్నారు.
'ఎమర్జెన్సీ ఓ మచ్చ'
'రేపటితో అత్యయిక పరిస్థితి ఏర్పడి 50 ఏళ్ల పూర్తవుతాయి. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఓ మచ్చలా మిగిలిపోయింది. అప్పుడు జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు. ఈ దేశానికి బాధ్యతాయుతమైన విపక్షం అవసరం. ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నా.' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Also Read: NEET UG Re-Exam: 'నీట్' రీఎగ్జామ్ కు సగం మంది అభ్యర్థులు డుమ్మా, అసలేం జరుగుతోంది?