NEET UG ReExam 2024: దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ-2024 పేపర్‌ లీకేజీ ప్రకంపనలు వెల్లువెత్తుతోన్న వేళ సుప్రీంకోర్టు ఆదేశాలతో జూన్ 23న నీట్ రీఎగ్జామ్ నిర్వహించారు. పరీక్ష సమయంలో కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు జూన్ 23న పరీక్ష నిర్వహించింది. మొత్తం 1563 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా.. కేవలం 813 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 750 మంది పరీక్ష రాయలేదని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే దాదాపు 50 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు డుమ్మా కొట్టారు.


నీట్ యూజీ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో.. కేంద్రం నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీ విచారణ జరిపి కేంద్రానికి నివేదిక సమర్పించింది. కమిటీ ఇచ్చిన నివేదికలోని నిర్ణయాలను కేంద్రం జూన్ 13న సుప్రీంకోర్టుకు వివరించింది. పరీక్ష సమయంలో కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు కోర్టుకు వెల్లడించింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. జూన్ 23న పరీక్ష నిర్వహించి జూన్ 30లోగా ఫలితాలను ప్రకటిస్తామని సుప్రీంకోర్టులో కేంద్రం స్పష్టం చేసింది. ఆ విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాతే కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయడం ఆసక్తిలేని విద్యార్థులు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు జూన్ 23న నీట్ రీఎగ్జామ్ నిర్వహించింది.


ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు..
మరోవైపు పరీక్షలను పారదర్శకంగా, సవ్యంగా, న్యాయంగా నిర్వహించడానికి  అవసరమైన సంస్కరణలు సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీకి ఇస్రో మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్‌  నేతృత్వం వహించనున్నారు. ఎన్టీఏ నిర్మాణం, పనితీరు, సమాచార భద్రత వంటి అంశాలపైనా ఈ కమిటీ సూచనలు చేయనుంది. ఈ కమిటీలో ఎయిమ్స్‌ ఢిల్లీ మాజీ డైరెక్టర్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బి.జె.రావు, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ కె.రామమూర్తి, కర్మయోగి భారత్‌ సహ వ్యవస్థాపకుడు పంకజ్‌ బన్సల్‌, ఐఐటీ దిల్లీ డీన్‌ (విద్యార్థి వ్యవహారాలు) ప్రొఫెసర్‌ ఆదిత్య మిత్తల్‌, కేంద్ర విద్యాశాఖ  జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ సభ్యులుగా ఉన్నారు. 


రెండు నెలల్లో కమిటీ నివేదిక..
కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కమిటీ రెండు నెలల్లోగా తన నివేదికను సమర్పించనుంది. ఇటీవల నీట్‌, నెట్‌ ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అవడం తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలోనే  కేంద్రం తాజాగా ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను అమల్లోకి తెచ్చింది.    దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా నేరంగా పరిగణిస్తారు. బాధ్యులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే వీలుంది. 


అమల్లోకి 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్..
దేశంలో వరుస పేపర్ లీకులతో సతమవుతున్న కేంద్రం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పేపరు లీకేజీలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకుగాను యుద్ధప్రాతిపదికన 'ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్)యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.