BRS Vs Congress: తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. అధికారంలో ఉన్న వారి బలం కంటే ప్రజల బలం గొప్పదని అన్నారు. రోజుకో ఎమ్మెల్యే కారు దిగిపోయి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై ఘాటుగా  రియాక్ట్ అయ్యారు. బీఆర్‌ఎస్‌కు 2004-06 మధ్య ఇలాంటి ఎమ్మెల్యే ఫిరాయింపులు చాలా ఎదుర్కొన్నామన్నారు కేటీఆర్‌. 


"ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి ఎప్పుడు అధికారంలో ఉన్నవారి కన్నా బలంగా ఉంటుంది. 2004-06 సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఇబ్బందులను ఎదుర్కొంది. ఇలాంటి కష్టాలు బీఆర్ఎస్‌కు కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై తెలంగాణ ప్రజలు తిరగబడతారు. ఈ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ తల వంచక తప్పలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది."






ప్రజాబలం ముందు కాంగ్రెస్ కచ్చితంగా తలవొంచే రోజు వస్తుందని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజల తరఫున పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్న కేటీర్‌ ఆరోజు కాంగ్రెస్ కచ్చితంగా తల దించాల్సి వస్తోందని అన్నారు. చరిత్ర పునరావృతమవుతుందన్నారు. 


కటింగ్ మాస్టర్ అంటూ విమర్శలు
ప్రతి పథకంలో కోతలు పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఆదివారం విమర్శలు చేశారు కేటీఆర్‌ ఆయన ఏమన్నారంటే..."నాడు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదలు ₹39 వేల కోట్లు అని ఇప్పుడు ₹31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు. " అని విమర్శలు చేశారు. 


ఏదో నెపంతో కోతలు పెడితే మాత్రం సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. "పాసుబుక్కులు లేవనే నెపంతో లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం.. రేషన్ కార్డు సాకు చూపి... లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించం.. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి.. శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోం.." అని హెచ్చరించారు. 


రైతు రుణమాఫీలోనే కాదని చాలా పథకాల్లో వివిధ కారణాలతో కోతలు పెడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్‌..."మొన్న.. లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారు నిన్న..200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు... 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి...లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదు.. " అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.  






రైతు బంధు విషయంలో కూడా ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని విమర్శలు చేశారు మాజీ మంత్రి " నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు.. ఓట్ల పండగ ముగిసినా.. ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదు.. కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారు..అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అని కోతపెడుతున్నారు. రుణమాఫీపై మాట తప్పినా... మడమ తిప్పినా... లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతాం" అని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.