Telangana News: హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. అసలు క్రైమ్ రేట్ పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
రాత్రి వేళల్లో ఎక్కువ మంది రోడ్లపై ఉండట, షాపులు రాత్రిళ్లు తెరవడంపై పోలీసులు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి 10.30 నుంచి 11 మధ్య షాప్‌లు క్లోజ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నగరంలో శాంత్రిభద్రతలు చాలా ముఖ్యమని అందుకే వ్యాపారులు సహరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
సీఎం సూచనలతో పోలీసులు కూడా చర్యలకు ఉపక్రమించారు. హైదరాబాద్‌లోని కమర్శియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కింద ఉన్న వ్యాపార సంస్థలు రాత్రి పదిన్నర నుంచి పదకొండు గంటల మధ్య క్లోజ్ చేయాలని ఆదేశాలు విడుదల చేశారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని దీనిని అమలు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు.
ఇలా రాత్రి పదిన్నర నుంచి 11 మధ్య షాపులు క్లోజ్ చేయాలని ఆదేశాలు రావడంపై వ్యాపారులు, నగరవాసుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పగలంతా జరిగే వ్యాపారం కంటే రాత్రి 6 గంటల తర్వాత 12 గంటల వరకు జరేగ వ్యాపారం ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. త్వరగా షాప్‌లు క్లోజ్ చేయాల్సి వస్తే మాత్రం ఇబ్బంది ఉంటుందని అంటున్నారు.
హైదరాబాద్‌కు నైట్ షాపింగ్ కొత్త కళను తీసుకొచ్చిందని పగలంతా ఆఫీసుల్లో ఉన్న వారు రాత్రి వేళల్లో షాపింగ్ చేస్తుంటారని దాన్ని నియంత్రించడం బాగాలేదంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉంటున్నారని వారికి నచ్చినట్టు షాపింగ్ చేస్తే తప్పేంటని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు.
క్రైమ్ రేట్‌కి నైట్‌షాపింగ్‌కు సంబంధం లేదని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సత్య అంటున్నాడు. పగలంతా ఆఫీసుల్లో తీవ్ర ఒత్తిడిలో ఉన్న తమలాంటి వాళ్లకు నైట్ షాపింగ్ కొంత రిలీఫ్ ఇస్తుందని అంటున్నాడు. నేరస్తులను నియంత్రించాల్సిన పోలీసులు ఇలాంటి వాదన తీసుకురావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు.
నైట్ షాపింగ్ తీసేయడంతో ఫుడ్ కూడా దొరక్క చచ్చిపోయే పరిస్థితి ఉంటుందని అంటున్నాడు హర్ష అనే ఉద్యోగి. రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేసే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడతాయని అంటున్నారు. ఇలాంటివి నేర నియంత్రణకు ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉండబోవని అభిప్రాయపడుతున్నాడు.